విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం రకరకాల కారణాలను తెరమీదకు తీసుకు వచ్చి.. ఎప్పటికప్పుడు జాప్యం చేస్తూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు కొన్నాళ్ల పాటు… కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. తర్వాత మానుకున్నాయి. కానీ ఇప్పుడు.. అంటే తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ రెడీ చేస్తున్న సమయంలో… నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన లీక్ బయటకు వచ్చింది. నిజానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో… ఏపీలో కలిసిన ఏడు మండలాల విషయం.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. నిన్నామొన్నటి వరకు అక్కడి ఓటర్లను తెలంగాణ ముసాయిదాలోనే చూపించారు. మూడు రోజుల కిందట.. ఆ ఏడు మండలాల ఓటర్లను ఏపీలో కలుపుతూ గెజిట్ జారీ చేశారు. అయితే దీంతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఓ రాష్ట్రంలోని ఓటర్లను మరో రాష్ట్రంలో కలిపినప్పుడు… నియోజకర్గాలను కూడా పునర్విభజించాల్సిందే. దాని ప్రకారం రిజర్వేషన్లు కూడా మార్చాల్సిందే. ఈ విషయాలపై ఎవరైనా కోర్టుకు వెళ్తే… ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.
అందుకే సమస్య పరిష్కారం అయ్యేలా లేకపోవడంతో.. కేంద్ర హోంశాఖ నియోజకవర్గా పునర్విభజన ఫైల్ ను మళ్లీ బయటకు తీసినట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టి ఆ ప్రక్రియను పూర్తి చేయాలనే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అవకాశం ఉన్నంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని పెండింగ్ లేకుండా చూడాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించిన హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు కసరత్తు చేయడమేమిటన్న సందేహం.. తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహింప చేసుకుని.. డిసెంబర్ తొలి వారంలో కొత్త ప్రభుత్వం కొలువయ్యేలా తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంటే… మాత్రం కచ్చితంగా… ఫిబ్రవరి వరకూ ఆశలు లేనట్లే..!
నిజానికి జనవరి – ఫిబ్రవరిలోనే… ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందని.. తాజాగా.. మోడీ, అమిత్ షా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాఫెల్ వ్యవహారం ముదురుతూండటం.. పెట్రో రేట్లు.. తగ్గే సూచనలు లేకపోవడంతో… వీలైనంత తక్కువ నష్టంతో బయటపడాలంటే… జనవరి-ఫిబ్రవరి ఎన్నికలు బెటరని ఆలోచిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే.. కొన్ని సన్నిహిత పార్టీలకు సమాచారం అందిందని.. అందుకే జగన్.. జనవరిలో ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారని అంచనాలున్నాయి. ఒక వేళ ఇదే కనుక నిజయం అయితే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వ్రతమూ చెడుతుంది.. ఫలితమూ దక్కదనే అంచనాలు ప్రారంభమయ్యాయి.