ప్రపంచపెట్టుబడిదారుల సదస్సు … దావోస్లో ప్రతీ ఏడాది జరుగుతుంది. భారత్ నుంచి పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. చంద్రబాబు రెగ్యులర్ గా వెళ్తారు. పెట్టుబడి వస్తుందనుకుంటే.. అక్కడికి వెళ్తారు. కేటీఆర్ కూడా ప్రతీ ఏడాది వెళ్లేవారు. అక్కడ చలి ఎక్కువ అని..స్నానం చేయడం కూడా కష్టమని అందుకే వెళ్లదల్చుకోలేదని వైసీపీ హయాంలో పరిశ్రమల మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ చెప్పి..తమ ప్రాధాన్యాలు వేరని నిరూపించడంలో ఏపీ దావోస్ రాడార్లో పదేళ్ల పాటు లేకుండా పోయింది.
ఇప్పుడు సీన్ మారిపోయింది. రెండురాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు.. వాటి అధినేతలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నారు. పోటాపోటీగా దావోస్లో తమ రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో కనిపించని పోటీ ఉండనుంది. అయితే.. దావోస్ పెట్టుబడుల సదస్సులో పెట్టుబడుల ప్రకటనల్ని ప్రజలు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రచారం అలా జరుగుతుంది. అక్కడ ప్రభుత్వాలు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేస్తాయి. ఒప్పందాలు చేసుకున్నట్లుగా చెబుతాయి. కానీ అవి నిజంగా ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో మాత్రం చెప్పడం లేదు. అక్కడే సమస్య వస్తోంది.
చంద్రబాబు, కేటీఆర్, రేవంత్ ఎవరు అయినా దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకుంటే వెంటనే అన్ని వేల కోట్ల పెట్టుబడి వస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి అవి ఎంవోయూలు మాత్రమే. తర్వాత ఎంతో ప్రక్రియ ఉంటుంది. వాటిని ఫాలో అప్ చేసుకోవాలి. ఆయా కంపెనీలు అడిగిన రాయితీల్ని ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడి గ్రౌండ్ అవుతుంది. అలా వచ్చిన పెట్టుబడే అసలు పెట్టుబడి. ఇలా ఎంవోయులు చేసుకునే వాటిలో కనీసం పదిశాతం గ్రౌండ్ అయినా పారిశ్రామికంగా ముందడుగు పడినట్లే. అవే నిజమైన పెట్టుబడులు.
ఇన్ని వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించాం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కన్నా… ముందు గ్రౌండ్ రెడీ చేసుకున్నానన్న భావన ఉండాలి. వేల కోట్ల ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదు.నిజంగా వచ్చే పెట్టుబడుల గురించే వారు చర్చించుకుంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. పెట్టుబడుల కోసం వెళ్లిన టీములు.. వేల కోట్ల ప్రకటనలు చేయకుండా.. వాస్తవ దృష్టితో … అసలైన వివరాలు చెబితే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.