ఏదైనా ఒక సమస్యపై కమిటీ ఎందుకు వేస్తారు..? ఆ కమిటీలో అనుభవం ఉన్న నాయకుల్ని సభ్యులుగా ఎందుకు నియమిస్తారు..? ఆ పర్టిక్యులర్ సమస్యపై వీలైనంత త్వరగా… వీలైనంత లోతుగా అధ్యయనం చేసి, ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపిస్తారనే కదా! కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చిక్కుముళ్లను విప్పేందుకు ఏర్పాటైన కమిటీ పనితీరు మాత్రం ఈ స్ఫూర్తికి భిన్నంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఉమ్మడి ఆంధ్రా విభజన జరిగిన ఒక్కో సంవత్సరమూ గడిచిపోతూ ఉన్నా… తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు చాలానే ఉన్నాయి. ఈ పంచాయితీలు ఎప్పటికప్పుడు తెరమీదికి రావడం, ఇరు రాష్ట్రాల మంత్రులూ పరస్పరం విమర్శలు చేసుకోవడం చూస్తూనే వచ్చాం. ఇక, తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో గవర్నర్ చొరవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైతేనేం, ఎట్టకేలకు ఒక త్రిసభ్య కమిటీ ఈ సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇంకేముంది, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పంపకాలు, సంస్థల విభజన అన్నీ చకచకా అయిపోతాయనుకున్నాం. కానీ, ఈ కమిటీ కేవలం భేటీలకు మాత్రమే పరిమితం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రా తరఫున ఏర్పాటైన త్రిసభ్య కమిటీలు కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు గవర్నర్ ను కలవడమే మిగులుతోంది. విభజన చిక్కుముళ్లను విప్పడం కంటే… సమావేశాల నిర్వహణతో కాలయాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది. సమావేశాలు అయితే బాగానే జరుగుతున్నాయి. కానీ, సమస్యలే.. ఎక్కడివి అక్కడే ఉంటున్నాయి. ఆంధ్రా తెలంగాణ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలూ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, టైం వేస్ట్ కార్యక్రమాలు తగ్గించాలని తాజాగా గవర్నర్ కూడా అభిప్రాయపడ్డారు.
విచిత్రం ఏంటంటే… కమిటీకి బాధ్యతలు అప్పగించేసి, ముఖ్యమంత్రులిద్దరూ చేతులు దులిపేసుకుని కూర్చున్నట్టున్నారు! ఈ క్రమంలో చంద్రబాబుగానీ, కేసీఆర్ గానీ ప్రధానంగా ఎదుర్కోవాల్సిన విమర్శ ఏంటంటే… ఓటుకు నోటు లాంటి కేసు గురించి అయితే ఇద్దరు చంద్రులూ ఆఘమేఘాల మీద చర్చించేసుకుంటారు. జఠిలం అనుకున్న ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టేశారు. అదే స్థాయి చొరవ ఇతర అంశాలపై చూపించి ఉంటే ఈ విభజన సమస్యలు ఎప్పుడో పరిష్కృతం అయ్యేవి కదా! తాజాగా సమావేశమైన త్రిసభ్య కమిటీ భేటీలో సమస్యల సాధన దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంకా తాత్సారం చేస్తూ పోతూ చంద్రబాబు, కేసీఆర్ కూడా మరిన్ని విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది.