తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నేతలకు అత్యంత ఇష్టమైన వ్యక్తి గవర్నర్ నరసింహన్. ఎందుకంటే..ఆయన తన పరిధులు దాటి మరీ.. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టి బీజేపీకి మేలు చేస్తూంటారని… వారి నమ్మకం. అందుకే గవర్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూంటారు కానీ.. బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడూ నోరు జారలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. కొద్ది రోజుల క్రితం.. ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.. గవర్నర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అంత కంటే ఘాటుగా… వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల గవర్నర్ వీసీల సమావేశం నిర్వహించారు. వీసీల పనితీరును గవర్నర్ ప్రశంసించారు. దీనపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల వీసీల సమావేశంలో గవర్నర్ ఏం చూసి సంతృప్తి వ్యక్తం చేశారో రాజ్‌భవన్ కార్యాలయం చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దాదాపు 70 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ గవర్నర్ మాత్రం ఏం చూసి సంతృప్తి వ్యక్తం చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వర్సిటీల పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయన్నారు. ఓయూలో ఇప్పటికీ ఒక్క ప్రొఫెసర్ కూడా లేని డిపార్ట్మెంట్లు ఉన్నాయన్న సంగతి తెలుసోలేదోనని ఎద్దేవా చేశారు. అసలు గవర్నర్ ఏం చూసి మెచ్చుకున్నారో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు … గవర్నర్ గుళ్లూ, గోపురాల చుట్టూ తిరగడానికే తప్ప ఏ పనీ చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ నరసింహన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయడానికి టైం లేదా అని ప్రశ్నించారు.
కారణం లేకుండా.. బీజేపీ నేతలు అకారణంగా.. గవర్నర్ పై కోపం పెంచుకోరన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఆ కారణాలేమిటనేది ఎవరికీ అంతు బట్టడం లేదు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమితులైనా… బీజేపీ పెద్దల ప్రాపకం కూడా పొందిన గవర్నర్ వ్యవహారాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు. గవర్నర్ పై బీజేపీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఢిల్లీ నుంచి జరుగుతోందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.. !