టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ఇద్దరూ… ఢిల్లీకి గురి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. వారిద్దరూ వెళ్తున్న దారి వేర్వేరుగా కనిపిస్తున్నా లక్ష్యం మాత్రం స్పష్టం. రైతు ఎజెండాను భుజాన వేసుకుని కేసీఆర్… ముందుకెళ్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే…జాతీయ స్థాయి రాజకీయాలని చంద్రబాబు చెబుతున్నారు.
కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, దేవేగౌడ లాంటి ప్రాంతయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. శివసేన, డీఎంకే, బిజూజనతాదళ్ నేతలతోనూ చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరుణానిధి, స్టాలిన్ లతో సమావేశం కోసం చెన్నై వెళ్తున్నారు. అందరితో చర్చలయిపోయిన తర్వాత కలిసొచ్చే వారితో కేసీఆర్ ఫ్రంట్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నేరుగా జాతీయ రాజకీయ ప్రస్తావన తేవడం లేదు. ప్రధానిని నిర్ణయించబోయేది తెలుగుదేశం పార్టీనే అంటున్నారు. కానీ దానర్థం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరాలన్నా… ప్రత్యేకహోదా రావాలన్నా… కేంద్ర ప్రభుత్వం… రిమోట్ మన చేతుల్లో ఉండాలంటున్నారు. అలా ఉండాలంటే.. 25 పార్లమెంట్ సీట్లలోనూ టీడీపీని గెలిపించాలని పిలుపునిస్తున్నారు.
అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ చెబుతున్నది వేర్వేరు. కానీ అర్థం మాత్రం ఒక్కటే. అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిచి.. కేంద్రంలో చక్రం తిప్పడం ఇద్దరి లక్ష్యం. వీరిద్దరి ప్రయత్నాలకు కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు వచ్చే అకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ మార్పులకు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. చంద్రబాబు, కేసీఆర్ ల ప్రయత్నాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. భారతీయజనతాపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కర్ణాటక ఎన్నికల్లో తేలితే.. ఒక్కసారిగా రాజకీయాలు ఊపందుకుంటాయి. గత ఎన్నికల ముందు బీజేపీకి… నరేంద్రమోదీకి ఎంత పాజిటివ్ వేవ్ వచ్చిందో.. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోతే.. అదే స్థాయిలో నెగెటివ్ వేవ్ వచ్చే చాన్స్ ఉంది.
ఇప్పుడు అటూఇటుగా ఆలోచనలు చేస్తున్న రాజకీయ పార్టీలు… బీజేపీకి భవిష్యత్ లేదు… కాంగ్రెస్ కు సామర్థ్యం లేదని తెలితే.. కచ్చింతగా ఓ కూటమిగా ఏర్పడటానికే అవకాశం ఉంది. కేసీఆర్ నమ్మకం కూడా ఇదే. చంద్రబాబుకు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో పలుకుబడి ఉంది. ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కూటమి కడతామని చెప్పకుండానే అన్నీ పార్టీలను సమన్వయ పరుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీయేతర పాలన ఉన్న రాష్ట్రాలన్నింటినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని.. ఆ నష్టంపై చర్చించేందుకని… అమరావతిలో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, కర్ణాటకలకు కూడా ఆహ్వానం పంపారు. ఇది రాష్ట్ర అంశాలకు సంబంధించిన అంశంపై చర్చించడానికైనా… ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎవరు వస్తారు.. అన్నదానిపై… చంద్రబాబు ప్రయత్నాలు..ఎంత మేర సక్సెస్ అవుతాయన్నది ఆధారపడి ఉండే అవకాశం ఉంది. లోక్ సభ సీట్లు ఎన్ని ఎక్కువొస్తే అంత బలంగా ఉంటామని చంద్రబాబు భావన. . ఏం చేసినాఅందుకే దీనిపైనే ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. అంటే కేసీఆర్ లక్ష్యం..ఎన్నికల ముందు ఫ్రంట్.. చంద్రబాబు లక్ష్యం ఎన్నికల తర్వాత కూటమి .