అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. నిజంగానే కన్నబిడ్డల కన్నా వారు కన్న బిడ్డలపై తాతలు అవ్వలకు ఎక్కువ ప్రేమలుంటాయి. ే అధికారంలో వున్నవారికి అధినేతలకూ కూడా అంతే గనక మనవలు మనవరాళ్లను ముద్దు చేస్తుంటారు. బాగానే వుంది గాని వారసత్వ కోణాలు పెరిగిపోయాక ఇదో కొత్త ధోరణిగా మారిపోతున్నది. ఏమంటే కుమారులు ఎలాగూ వారసులే. వారి కుమారులూ వారసులై పోతే అది కూడా బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడే ఫోకస్ ఇచ్చేస్తే మా గతి సంగతి ఏమిటని పాలక పార్టీల్లో యువ నేతలు గోలపెట్టాల్సి వస్తుంది. కెసిఆర్ మనవడు హిమాన్షు తరచూ తాతపక్కన దర్శనమివ్వడమే గాక ఆ ఠీవి చూపిస్తుంటారు. వందిమాగధులెలాగూ ఎవరెడి బ్యాటరీల్లా వుండనే వుంటారు గనక బాస్‌ను మెప్పించడం కోసం మోసుకుతిరుగుతారు. ఈ మధ్యన భద్రాచలంకు మంత్రి ఇంద్రికరణ్ రెడ్డితో పాటు మనవడు హిమాన్షును కూడా కెసిఆర్ పంపించారంటే యాదృచ్చికం కాదు. మంత్రి ప్రభుత్వానికీ మనవడు కుటుంబానికి ప్రతినిధులని చెప్పినంత మాత్రాన జరిగే హంగామా ఎలాగూ ఆగదని ఆయనకు తెలుసు. ఇప్పుడు హిమాన్షు తెలివితేటలను టిఆర్ఎస్ నేతలు పొగిడేస్తుంటే చెవులప్పగించి వినకతప్పడం లేదట.
ఇక చంద్రబాబు మనవడు దేవాన్ష్ బాగా చిన్నపిల్లాడు. అయితే కసికందునే వేదికపై ప్రధాని మోడీకి చూపించి కెమెరాల ముందుకు తెచ్చిన తాత చంద్రబాబును ఏమనాలి? అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా దేవాన్ష్ గురించి చెప్పడం ఫోటోలు చూపడం జరుగుతూనే వుంది.ఈ మధ్యన లోకేశ్ బాబు ప్రమాణ స్వీకారం రోజున డాలర్ శేషాద్రి, రమణ దీక్షితులు తిరుపతి నుంచి వచ్చి మరీ ఆశీర్వాదాలిచ్చినపుడు బుల్లి బాబును కూడా దీవించారట. ఆ సమయంలో తాత కళ్లలో ఆనందానికి చుట్టూ వున్నవారంతా ఆశ్చర్యపోయి అవురా తాతానందమనుకున్నారట. మనకు తెలిసిన చంద్రబాబేనా అని గిల్లుకుని చూసుకున్నారట. అయితే వచ్చేతరంలోనూ మేమిలా పడి వుండాల్సిందేనా అని లోలోపల అనుకున్నట్టు కొందరు చెబుతున్నారు. తప్పదు కదా, మన ప్రజాస్వామ్యం అనువంశికం. కాంగ్రెస్‌లో అయిదో తరం నడుస్తుంటే ఇక్కడ నాలుగో ోతరమే వద్దంటే ఎలా.. హిమాంశులైనా దేవాంశులైనా అధికారాంశులు మరి!