డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే వారి లక్ష్యం ఏమిటి ?. అప్పటికప్పుడు తమ ప్రొడక్టు కొనకపోయినా సరే .. నేరుగా ప్రచారం చేసినట్లుగా ఉండటానికే కంపెనీలు ఈ తరహా ప్రచారాన్ని ఉపయోగించుకుంటాయి. అప్పటికప్పుడు బుకింగ్ అయితే ప్రచారానికి ప్రచారం , బుకింగ్‌లకు బుకింగ్. ఇది విజయవంతమైన మార్కెటింగ్ ప్రక్రియ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు తమ రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం దావోస్‌లో అదే పని చేయబోతున్నారు. కనిపించిన ప్రతి పెట్టుబడిదారులుకు తమ రాష్ట్రంలో ప్రత్యేకతలో వివరించి.. “తమ రాక మాకెంతో సంతోషం సుమండి” అని చెప్పబోతున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. రెండో సారి సీఎం హోదాలో దావోస్ వెళ్తున్నారు. గత ఏడాది వెళ్లారు కానీ అప్పటికి పదవి చేపట్టి స్వల్ప సమయం కాబట్టి.. అంతకు ముందు చేసిన ప్లానింగ్ ను బట్టే ఆయన టూర్ సాగింది. కానీ ఆ సారి మాత్రం.. తన టీమ్ ముద్ర స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో అయినా ఇప్పుడు అయినా తెలంగాణ పెట్టుబడుల వ్యవహారాలను చూసేది.. కంపెనీలతో టచ్ లో ఉండేది ఐఏఎస్ అధికారి జయేష్ రంజనే. ఆయనే ఈ సారి కూడా అన్నీ చక్కబెడుతున్నారు. దావోస్ లో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్ తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు దావోస్ అనుభవం చాలా ఎక్కువగా ఉంది. సీఎంగా ఉన్న ప్రతీ ఏడాది వెళ్తారు. సదస్సు జరిగిన మూడు రోజుల పాటు ఏపీని విస్తృతంగా ప్రమోట్ చేస్తారు. దిగ్గజం పారిశ్రామిక వేత్తల్ని ఏపీకి ఆహ్వానిస్తారు. ది బెస్ట్ అనే రీతిలో ఏపీ ప్లస్ పాయింట్లను ప్రజెంట్ చేస్తారు. ఏపీ గురించి పారిశ్రామిక వేత్తలకు బాగా తెలిసేలా ప్రచారం చేయడానికి పెట్టుబడి కూడా పెడతారు.గతంలో దావోస్ టూర్ల వల్ల పెట్టబుడులు కూడా వచ్చాయి. పెట్టుబడులు వచ్చినా రాకపోయినా ఏపీని .. పెట్టుబడిదారుల గుడ్ లుక్స్‌లో ఉంచడానికి వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాల గుర్తుల్ని మర్చిపోయేలా చేయడానికి చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నించే అవకాశం ఉంది.
గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ రెడ్డి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు నేరుగా వెళ్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల పాలనలో వచ్చిన కీలక మార్పు అనుకోవచ్చు.