రెండు దేశాల మధ్య సరిహద్దులు ఉంటాయి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులుంటాయి. రెండు జిల్లాల మధ్య సరిహద్దులుంటాయి. రెండు అటవీ ప్రాంతాల మధ్య సరిహద్దులుంటాయి. చివరకు విడిపోయిన రెండు కుటుంబాల మధ్య కూడా సరిహద్దులుంటాయి. కాని ఇప్పుడు కొత్త సరిహద్దులు వెలిసాయి. అదే గ్రామాల మధ్య సరిహద్దులు. ఇంత వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సరిహద్దులను ఎవరూ వినలేదు. కనలేదు. అయితే కరోనా పుణ్యమాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇవే సరిహద్దులు రాజ్యమేలుతున్నాయి. నానాటికి ప్రపంచాన్ని ముంచెత్తుతున్న కరోనా వైరస్ కంట పడకుండా ఉండేందుకు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో గ్రామాల మధ్య ప్రజలు సరహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, సిరిసిల్లా, అదిలాబాద్ జిల్లాల్లోని పలు గ్రామస్తులు తమ గ్రామశివారులో ముళ్ల కంచెలతోను, పెద్ద రాళ్లతోనూ కంచెలు ఏర్సాటు చేసుకుంటున్నారు. బయట వారెవ్వరూ తమ గ్రామంలోకి రావద్దని కోరుతూ పెద్ద పెద్ద ప్లకార్డులు ఏర్సాటు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని పలు గ్రామ శివారు సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు కాళ్లు, చేతులు కడుక్కుందుకు డ్రమ్ములతో నీళ్లు ఏర్పాటు చేస్తున్నారు. బయటి వారు ఎవ్వరూ తమ గ్రామంలోకి రావద్దని, కరోనా వైరస్ ను రాకుండా చేసేందుకు సహకరించాలంటూ శివారులోనే కోరుతున్నారు. చేతులు కడుక్కునేందుకు శానిటైజర్లను కూడా గ్రామస్తులే ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కక్షలు, కార్పణ్యాలకే కాదు…. తోటి వారి పట్ల ప్రేమకు కూడా ముందుంటాయని కరోనా ద్వారా నిరూపిస్తున్నారు.