ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల చేత ఎందుకు ట్యాక్స్‌లు కట్టించుకుంటాయి? ప్రజల జీవితాలను మరింత బెటర్‌గా తీర్చిదిద్దడానికి. మరి అవే ట్యాక్స్‌లు ప్రజలందరి జీవితాలనూ ఇబ్బందులకు గురి చేస్తుంటే…అది కూడా పాలకుల వ్యక్తిగత పట్టుదలకు ప్రజలు నష్టపోయే పరిస్థితులు వస్తే పాలకులు రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేదా? స్మార్ట్ సిటీలను చేయాలని కంకణం కట్టుకోవడం, బుల్లెట్ రైళ్ళు, ఊరికో ఎయిర్పోర్ట్, క్యాష్‌లెస్ జీవితాలు, ఇంటికో టి.వి, సెల్‌ఫోన్……అబ్బో…తెలుగు ప్రజలందరినీ ఉద్ధరించాలన్న తాపత్రయంలో మన నాయకులు ఇచ్చే ఎన్నికల హామీలు మామూలుగా ఉండవు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచీ ఒక్క ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రతి రోజూ కూడా ఏదో ఒక అద్భుతమైన అభివృద్ధి జరిగిపోతూనే ఉందనో, భవిష్యత్తులో జరుగుతుందనో మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ చేతలు మాత్రం ప్రజలను ఇబ్బందుల పాలు చేసేలాగానే ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని విభజన చట్టంలో ఉంది. కానీ మన తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్‌కి ఆ రూల్ నచ్చలేదు. ట్యాక్స్‌లు పెంచుకుంటూ పోతే ఆ ప్రభావం మొత్తం కూడా నిత్యావసర వస్తువుల మీద పడుతుందని, ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిసినప్పటికీ కెసీఆర్ పట్టుదలకు పోయాడు. మొదట్లో చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు కూడా. కానీ కెసీఆర్ మాత్రం మొండి పట్టుదలకు పోయాడు. ఆ తర్వాత చంద్రబాబు కూడా కెసీఆర్‌నే ఫాలో అవుతూ ట్యాక్స్‌లు బాదాడు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అందుకే తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సింగిల్ పర్మిట్ విధానానికి ఇరు రాష్ట్రాలూ అంగీకరించాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణాలో లారీ ఇండస్ట్రీ నాశనం అయ్యే పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కెసీఆర్ ప్రభుత్వానికి ఇప్పటికి తత్వం బోధపడినట్టుగా ఉంది. విభజన చట్టంలో ఉన్న విషయాలను అమలు చేయాలని కేంద్రంపైన ఒత్తిడి తీసుకుని వస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తరచుగా చెప్తూ ఉంటారు. మరి అదే విభజన చట్టంలో ఉన్న విధంగా ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ విధానాన్ని సవరించే దిశగా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి మరి.