ఉగాది అంటే అందరికీ పంచాంగ శ్రవణాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుందో పండితులు వివరిస్తారు. నిజానికి పండితులు చెప్పేదానికి చాలా విలువ ఉంటుంది. అయితే రాజకీయపండితులు చెప్పే దానికి మాత్రం అసలు విలువ లేకుండాపోతోంది. రాజకీయ పార్టీల కార్యాలయాలు.. లేకపోతే ప్రభుత్వాల తరపున నిర్వహించే పంచాంగ శ్రవణాల్లో ఆయా పార్టీల వారి మనసుల్ని గెల్చుకోవడానికి పండితులు చేస్తున్న విన్యాసాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ ఉగాది పంచాంగ శ్రమణంలో అవే చిత్ర విచిత్రాలు కనిపించాయి.
ఏపీ ప్రజలు హాయిగా ఉంటారన్న ఏపీ దేవాదాయశాఖ ఆస్థాన సిద్ధాంతి !
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగిన ఉగాది వేడుకల్లో దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం.. పేరుకు తగ్గట్లుగానే ఈ సంవత్సరం అన్నీ శుభాలే జరుగతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని పంచాంగంలో ఉందని తెలిపారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తూ.. శుభకృత్కు తగ్గట్లే పాలన అందిస్తారని తెలిపారు.
కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు ప్రకటిస్తారన్న సంతోష్ కుమార్ శాస్త్రి !
కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి ప్రగతిభవన్లో జరిగిన ఉగాది వేడుకల పంచాంగ పఠనంలో తెలిపారు. 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా… 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. క్రీడా, రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కేసీఆర్ ది కర్కాటక రాశి అని…సీఎం జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి వెల్లడించారు. మీడియాకు తీరిక ఉండదని.. కావాల్సిన్ని పరిణామాలు జరుగుతాయన్నారు.
కేంద్రంలో ఓ నాయకుడి మరణం ఉంటుందన్న కాంగ్రెస్ సిద్ధాంతి !
విచిత్రంగా గాంధీభవన్ పంచాంగ పఠనంలో శ్రీనివాస మూర్ కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందని ప్రకటించేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవిచూస్తాయని పంచాంగంలో ఉందన్నారు. అక్టోబర్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని జోస్యం చెప్పారు.
ఇలా ఏపార్టీ ఆఫీసుకువెళ్తే ఆ పార్టీ తరపున పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రతీ ఏడాది అంతే.. అవి జరిగాయా లేవాఅని ఎవరూ పట్టించుకోరు. పండితులు చెప్పింది విని సంతోషపడటమే.. ఆపార్టీల నాయకులు చేయాల్సింది.