తెలంగాణ ప్రభుత్వం మరో బిల్లును అసెంబ్లీలో పెట్టింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చాలనుకుంది కానీ ఆ పని చేయలేదు. పొట్టి శ్రీరాములు పేరు మార్పు వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందన్న కారణంతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరూ అడగకపోయినా బీఆర్ఎస్ ను మించిన తెలంగాణ వాదనం చూపించాలన్నట్లుగా పేరు మార్పు చేయాలని నిర్ణయించుకున్నారు.
సురవరం ప్రతాపరెడ్డి స్థాయికి వేరే వారిని పేరును తీసేసి ఆయన పేరు పెట్టడం కూడా అవమానించడమేనన్న అభిప్రాయం ఉంది. ఏదైనా కొత్త సంస్థ.. దిగ్గజ సంస్థను ఏర్పాటు చేసి ఆయన పేరును పెడితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఇప్పుడు బీజేపీ సహా ఇతర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్, కాసు వంటి వారి పేర్లపై చాలా ఉన్నాయని వాటిని మార్చుతారా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న సమయంలో ఇలాంటి పేరు మార్పు నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు ఆహ్వానిస్తారు కానీ ఇప్పుడు ఎందుకన్న వాదన వినిపిస్తోంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ప్రాణ త్యాగమే కారణం. అలాంటి వారి పేరును తీసేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు ఏపీలో అమరావతిలో ఆయన భారీ విగ్రహం పెడతామని చంద్రబాబు ప్రకటించారు.