కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కీలకమౌతాయన్న అంచనాలు మొదట్నుంచీ ఉన్నాయి. ముప్ఫై నుంచి నలభై నియోజక వర్గాల్లో అక్కడ స్థిరపడ్డ తెలుగువారి ప్రభావం ఉంటుందన్న ఆందోళన భాజపాకి మొదట్నుంచే ఉన్నదే. ఎందుకంటే, ఏపీ విషయంలో భాజపా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అక్కడి ప్రజలు వ్యతిరేక ఓటేస్తారేమో అనే ఆందోళన ఆ పార్టీలో ముందే నెలకొంది. అందుకే, తెలుగువారి ప్రభావమున్న ప్రాంతాల్లో రకరకాల వ్యూహాలను అమలు చేశారు. ప్రజల్లో విభజన తీసుకొచ్చేందుకు ఎత్తులూ పైఎత్తులూ వేశారు. ఇంత జరిగాక, నేటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగువారి ప్రభావం చూపగలిగారా అంటే… అవుననే చెప్పాలి. భాజపాను నిలువరించాలని చేసిన ప్రయత్నం కొంతైనా ఫలించిందా అంటే.. దానికీ అవుననే అనొచ్చు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బలమైన రాజకీయ శక్తిగా భాజపా ఎదిగింది. 104 స్థానాల్లో విజయం సాధించింది. కానీ, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను సింగిల్ గా అందుకోలేకపోయింది. తెలుగు ప్రజలు కీలకం అనుకున్న రెండు జోన్లలోనూ భాజపాకి మరికొన్ని సీట్లు అదనంగా వచ్చి ఉంటే, సొంతంగా అధికారం దక్కించుకునే అవకాశం ఉండేది. హైదరాబాద్-కర్ణాటక రీజియన్ లో చూసుకుంటే… భాజపాకి 15 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ కి 21, జేడీఎస్ కి 4 దక్కాయి. తెలుగువారు అత్యధికంగా బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో కూడా భాజపాకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఈ ప్రాంతంలో మొత్తం 34 స్థానాలకిగాను, 11 మాత్రమే దక్కించుకోగలిగింది.
తెలుగు ప్రజలు కీలకం అనుకున్న ప్రాంతాల్లో భాజపాకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనేది వాస్తవం. కానీ, ఈ వాస్తవాన్ని భాజపా ఒప్పుకోదు కదా! అయినాసరే, ఈ ప్రాంతాల్లో గతంతో పోల్చితే ఎక్కువ స్థానాలే దక్కించుకున్నామనీ, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 6 నుంచి 15 సీట్లకు ఎదిగామని రామ్ మాధవ్ అంటున్నారు. గతం లెక్క వేరు, ఇప్పటి లెక్క వేరు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంశం చర్చనీయం కాలేదు. కానీ, ఇప్పటి ఎన్నికల్లో అక్కడ ఏపీ అంశం కూడా ప్రచారంలో భాగమైంది. నేటి ఫలితాల్లో మరో పది సీట్లు అదనంగా వచ్చి ఉంటే సింగిల్ గానే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగేది కదా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా… తెలుగువారు నివసించిన ప్రాంతాల్లో భాజపాకి ఎదురుగాలి బాగానే వీచింది. ఏపీ విషయంలో కేంద్రం మొండి వైఖరి అవలంభించకుండా ఉంటే… ఈ ప్రాంతాల్లో భాజపాకి మరిన్ని సీట్లు వచ్చేవి అనేది వాస్తవం.