ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్సీలను చేజార్చుకున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఈ విషయంలో బీఆర్ఎస్ ను ముందే హెచ్చరించింది తెలుగు360.కాం ( రేవంత్ మార్క్ రాజకీయం.. సారు స్ట్రాటజీలు పనిచేయట్లే..!)అనే కథనాన్ని మూడు రోజుల కిందటే ప్రచురించింది. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్ నిమగ్నం కావడంతో కాంగ్రెస్ ప్లాన్ బీ కి తెరలేపిందనిని ముందే పేర్కొనగా, ఇప్పుడు అదే జరిగింది.
ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకొని కేసీఆర్ కు హస్తం పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుందటంతో కేసీఆర్ ఫామ్ హౌజ్ వేదికగా ఇటీవల మంత్రాంగం షురూ చేశారు. ఎవరూ పార్టీని వీడొద్దని ఎమ్మెల్యేలకు నచ్చజెప్తుండగా..కేసీఆర్ ప్లాన్ కు కౌంటర్ గా ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. పార్టీ దిద్దుబాటు చర్యలో ఉండగానే ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్లాన్ మార్చి ఎమ్మెల్సీలను లాక్కునే పనిలో ఉందని తెలుగు360.కాం కథనాన్ని ప్రచురించిన మూడు రోజుల్లోనే ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడటం గమనార్హం. రాజకీయాల్లో ప్రత్యర్ధులను తుత్తునియలు చేసే సామర్ధ్యం ఉందని పేరెన్నిక గల కేసీఆర్, రేవంత్ వ్యూహాల ముందు తేలిపోతుండటం బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.