అనుష్క నిజంగానే ఓ అద్భుతం. ఎందుకంటే అద్భుతాన్ని ఎవ్వరూ ఊహించరు. అకస్మాత్తుగా వచ్చి పడిపోతుందంతే. ఈ రోజు చిత్ర పరిశ్రమలో అనుష్కకి వున్న స్థానాన్ని కూడా ఎవ్వరూ ఊహించి వుండరు.
” పర్లేదు.. గ్లామర్ బానే వుంది. కానీ యాక్టింగ్ చూసుకోవాలి ” ఇదీ సూపర్ లో అనుష్కని మొదటిసారి చూసి ఓ సగటు ప్రేక్షకుడు కొట్టిన కామెంట్. సీన్ కట్ చేస్తే.. అనుష్క ఇప్పుడు లేడీ సూపర్ స్టార్. తెలుగు సినిమా చరిత్రలో ఆమె కంటూ ఒక ప్రత్యేక స్థానం. అయితే ఇదంతా ఓవర్ నైట్ లో జరిగిపోలేదు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి పదమూడేళ్లయ్యింది. ఈ పదమూడేళ్ళలో ఒక సినిమా ఒప్పుకుందంటే దానికి కోసం అహర్నిశలు కష్టపడటమే తెలుసు అనుష్కకి. ఆ కష్టమే ఇప్పుడు ఆమెను లేడీ సూపర్ స్టార్ ని చేసింది. బేసిగ్గా హీరోయిన్స్ స్టార్ టైం తక్కువ. అందరి హీరోలతో జత కట్టేస్తే ఇక ఫేడ్ అవుటే. కానీ అనుష్క విషయంలో ఇది జరగలేదు. అరుంధతి తర్వాత ఆమెకు వచ్చిన టాప్ హీరోయిన్ కిరీటం ఇప్పటికీ ఆమె చెంతనే వుంది. ఎంత మంది క్రికెటర్లు వచ్చినా.. సచిన్ ప్లేస్ సచిన్ దే అన్నట్లు.. ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా అనుష్క ప్లేస్ అనుష్కదే. ఇంకొ పోటి లేదక్కడ. ఎందుకంటే అనుష్క స్టేచర్ అలాంటిది మరి.
గ్లామరసం- నట విశ్వరూపం
సమ్మోహనకరమైన రూపం అనుష్క సొంతం. చూడాగానే మనసు కొల్లగొట్టేసే సౌందర్యం అనుష్కది. మొదట్లో అనుష్కలోని ఈ అందాన్నే హైలట్ గా చూపించడానికి మొగ్గు చూపారు దర్శకులు. అనుష్క కూడా తన గ్లామరసంతో ప్రేక్షకుల మతి పోగొట్టేసింది. అయితే అరుంధతి సినిమా మాత్రం ఆమె కెరీర్ ను మరో మలుపు తిప్పేసింది. ఈ సినిమాతో అనుష్క మామూలు హీరోయిన్ కాదు. సంథింగ్ స్పెషల్ అని గుర్తించారు ప్రేక్షకులు. అసలు స్వీటీలో ఇంత క్యాలిబర్ వుందా ?! అంటూ సర్ప్రైజ్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత స్వీటీకి తమ మనసుల్లో స్పెషల్ ప్లేస్ ఇచ్చేశారు. అయితే అంతలోనే మళ్ళీ తన గ్లామర్ తో మతి పోగొట్టేసింది స్వీటీ. అరుంధతిగా కత్తి తిప్పిన అనుష్క.. వెంటనే బిల్లా అంటూ బికినీ వేసింది. మళ్ళీ సర్ ప్రైజ్ అవ్వడం ప్రేక్షకుల వంతైయింది. జనరల్ గా అరుంధతి లాంటి ఓ ట్రేడ్ మార్క్ రోల్ చేసిన ఓ హీరోయిన్ ఇలా మళ్ళీ బికినీలో కనిపించం అంటే హైలీ రిస్క్ . ప్రేక్షకుల నుండి తిరస్కరణ వచ్చే ప్రమాదం వుంది. అయితే అనుష్క విషయంలో అది జరగలేదు. ఇటు అరుంధతి నట విశ్వరూపాన్ని , అటు బిల్లాలో స్వీటీని సమానంగా ఆదరించారు ప్రేక్షకులు. ఈ వైవిధ్యం అనుష్కకు మాత్రమే చెల్లింది.
కోట్ల వ్యాపారం
ఎంత కళా పోషణ అనుకున్నా ఫైనల్ గా సినిమా కూడా వ్యాపారం. బేసిగ్గా ఈ వ్యాపారం హీరో క్రేజ్ ను, మార్కెట్ ను ద్రుష్టిలో వుంచుకొని జరుగుతుంటుంది. అంత హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ ఒక గ్లామర్ డాల్ మాత్రమే. లేడీ ఓరియంటెడ్ సినిమాలు విజయశాంతి తర్వాత ఎప్పుడో పోయాయి. అయితే మళ్ళీ ఆ కేటగిరిని బయటికితీసుకొచ్చింది అనుష్క. అరుంధతి సినిమాతో ఎవ్వరూ ఉహించని సక్సెస్ ను కొట్టింది. అసలు ఏ నమ్మకంతో అనుష్క పై ఏకంగా నలభై కోట్ల రూపాయిలు ఖర్చు చేశారో తెలియదు కానీ.. ఆ నమ్మకాన్ని నిలబెట్టింది అనుష్క. ఆ రోజుల్లో నలభై కోట్లు అంటే మాటలు కాదు. కానీ ఆ డబ్బులన్నిటిని వెనక్కి తీసుకురావడామే కాకుండా లాభాలు కూడా తెచ్చిపెట్టింది అరుంధతి . ఈ సినిమాతో మళ్ళీ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఊపోచ్చింది. అనుష్కపై కోట్లు ఖర్చు చేయడానికి నిర్మాతలు సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో వచ్చిన రుద్రమదేవి, తాజాగా వచ్చిన భాగమతి సినిమాలు అనుష్క స్టామినాను చాటాయి. రుద్రమదేవికి లాభాలు రాకపోయిన రుద్రమాంబగా అనుష్క నటన నభూతో భవిష్యతి. ఇక తాజాగా వచ్చిన భాగమతి అయితే కోట్ల వర్షం కురిపిస్తుంది. అనుష్క స్టామినాను నమ్మి దాదాపు నలభై కోట్లు ఖర్చు చేసిన నిర్మాతలు.. మొదటి నాలుగు రోజుల ఫలితాల్ని చూసి ఖుషిగా వున్నారు. కేవలం అనుష్క స్టామినాను నమ్మి కోట్లు ఖర్చు చేసిన నిర్మాతల నమ్మకాన్ని వమ్ము చేయలేదు స్వీటీ. తన సత్తా ఏమిటో చూపించింది. సరైన కధ పడితే.. తన నట విశ్వరూపంతో ప్రేక్షకులను మైమరపించి వసూళ్ళతో బాక్సాఫీసు షేక్ చేసే సత్తా తన దగ్గర వుందని మరోసారి నిరూపించింది భాగమతి.
మార్కెట్ పెంచిన దేవసేన
ప్రస్తుతం భాగమతి వసూళ్ళ లెక్క చూస్తుంటే.. నలభై కోట్లు ఏంటి ? అనుష్కపై ఓ పెద్ద హీరో సినిమాకి ఖర్చు చేసినట్లు 50,60 కోట్ల వరకూ పెట్టయడాని రెడీగా వున్నారు నిర్మాతలు. దీనికి కారణం దేవసేన. బాహుబలి వెండితెర అద్భుతమైతే దేవసేన పాత్ర కూడా అపురూపమైనదే. మహారాణి అంటే అనుష్కలా వుండాలి అనే భావన అందరిలో కలిగింది దేవసేనను చూసిన తర్వాత. ఈ సినిమా ఎన్ని భాషల్లోకి వెళ్లిందో అన్ని భాషల్లో కూడా అనుష్కకి అభిమానుల ఏర్పడ్డారు. తమిళ్ లో స్వీటీ ఆల్రెడీ టాప్ హీరోయిన్. బాహుబలి తో అక్కడ మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక కొత్తగా బాలీవుడ్, మలయాళం ఇండస్ట్రీల్లో కూడా అనుష్కకి మార్కెట్ వచ్చింది. భాగమతి ప్రీ రిలీజ్ బిజినెస్ దీనికి అద్దం పట్టింది. అనుష్క తో సినిమా అంటే.. నాలుగు భాషల్లో శాటిలైట్ తో సేఫ్ అయిపోవవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్, మలయాళంలో ఇప్పుడు భాగమతి పాజిటివ్ వేవ్ లో ఆడుతుండటం.. అనుష్క భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉటుందని చెప్పకనే చెబుతుంది.
కష్టేఫలి
మొదటి నుండి అనుష్కది వైవిధ్యమైన శైలి. అటు గ్లామర్ పాత్రలు చేస్తూనే నటనకు ఆస్కారం వుండే పాత్రలతో అలరించింది అనుష్క. ఈ క్రమంలో అరుంధతి , రుద్రమదేవి ఇప్పుడు భాగమతి లాంటి మైలురాళ్లు ఆమె ఖాతాలోకి వెళ్ళాయి. అయితే ఈ విజయాలు అంత తేలిగ్గా రాలేదు. అరుంధతి , రుద్రమదేవి, భాగమతి.. ఇవేవీ కూడా ఆడుతూ పాడుతూ చేసిన సినిమాలు కాదు. మొత్తం భారం తన భుజాలపై వేసుకొని ముందుకు నడిచింది అనుష్క. ఈ మూడు సినిమాల్లో కూడా ఎన్నో పోరాట సన్నీవేశాల్లో హీరోల మాదిరిగా వళ్ళుహూనం చేసుకుంది. పాత్ర కోసం అహర్నిశలు తపించింది. ఆ కష్టానికి ఫలితమే అనుష్కకి ఈ రోజు దక్కిన లేడీ సూపర్ స్టార్ ప్రశంస.
దేనికైనా రెడీ
గ్లామర్ పాత్రలతో మెరిసిన అనుష్క.. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సోలో విజయాలు సొంతం చేసుకుంది. అయితే అనుష్క కెరీర్ చెప్పుకొదగ్గ మరి కొన్ని సినిమాలు వున్నాయి. అనుష్క కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండే పోయే పాత్ర వేదంలో సరోజ. అప్పటికే అనుష్క ను అరుంధతి గుర్తుంచుకున్న ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం లేకుండా ఏకంగా ఒక వేశ్యలా కనిపించింది అనుష్క. ఈ పాత్ర కూడా సూపర్ హిట్. అనుష్కకి నటన పరoగా తృప్తిని ఇచ్చిన పాత్రల్లో సరోజ ఒకటి. పాత్ర నచ్చితే దేనికైనా రెడీ.. అని వేదంతో చాటి చెప్పింది స్వీటీ. ఇలా పాత్ర నచ్చి చేసిన మరో సినిమా సైజ్ జీరో. సన్నజాజి నాజూకు అందాలతో మైమరపించే అనుష్క.. ఈ సినిమా కోసం ఏకంగా పపాలా మారింది. ఒక్కసారిగా వెయిట్ పెంచేసింది. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని రాబట్టుకోలేకపోయిన అనుష్కకి మాత్రం ”నంది”ని తీసుకొచ్చింది. దీంతో పాత్ర కోసం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
ఓకే చెప్పడమే ఆలస్యం
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో హిట్లు కొట్టాను కదా.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తాననే కండీషన్లు ఏమీ పెట్టుకోలేదు అనుష్క. హీరోయిన్ పాత్రలకు కూడా సై అంటోంది. హీరోలతో తెరను పంచుకోవడానికి ఆమె రెడీ. అయితే ప్రస్తుతం ఇంకొన్ని రోజుల పాటు కొత్త సినిమాలకు అంగీకారం తెలపడం లేదు. అయినా నిర్మాతలు స్వీటీ కోసం వెయిట్ చేయడానికి సిద్ధంగా వున్నారు. భాగమతి నిర్మాతలు ఇలా వెయిట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు అనుష్క ఓకే చెప్పడమే ఆలస్యం అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఇటు హీరోయిన్ పాత్రలకు అడ్వాన్స్ లు ఇవ్వడానికి రెడీగా వున్నారు నిర్మాతలు. నిజంగా ఇది అద్భుతం. ఒక హీరోయిన్ కి పదమూడేళ్ళ తర్వాత కుడా ఈ లెవల్ లో క్రేజ్ వుండటం బహుసా ఈ దశాబ్ద కాలంలో అనుష్కకే చెల్లిందేమో. అందుకే.. అనుష్క ది గ్రేట్.