తెలుగు 360 జిల్లాల వారీగా అందిస్తున్న సర్వేలో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12 చోట్ల విజయం సాధించింది. రెండు చోట్ల విజయం సాధించింది. అందులో కదిరిలో వెయ్యి ఓట్ల లోపు… ఉరవకొండలో.. రెండు వేల ఓట్ల లోపు మాత్రమే.. వైసీపీ విజయం సాధించింది. అభ్యర్థుల విషయంలో వైసీపీ ఈ సారి … ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చింది. రెండు రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల భార్య, భర్తలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. మరో పది నియోజవర్గాల్లో మొత్తం రెడ్డి వర్గానికే అభ్యర్థిత్వం ఇచ్చారు. ఒక్క బీసీకి..మరో ముస్లిం వర్గానికి చాన్సిచ్చారు. దీంతో.. ఇతర వర్గాల్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.
అనంతపురం అర్బన్ లో రాజకీయం హోరాహోరీగా ఉంది. ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రెండోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగగా.. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేస్తున్నారు. జనసేన తరపున బలిజ సామాజిక వర్గానికి చెందిన టీసీ వరుణ్ పోటీచేస్తున్నారు. బలిజ వర్గం మద్దతుతో వరుణ్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వైసీపీలో గుర్నాథ్ రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్ సహా పలు వర్గాలున్నాయి. గుర్నాథ్ రెడ్డికి,వైసీపీ అభ్యర్థికి పడటం లేదు. వైసీపీ ఓట్లు జనసేన చీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి మరోసారి విజయం సాధించనున్నట్లు సర్వేలో తేలింది.
గుంతకల్లు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి వెంకటరామిరెడ్డితో పోటీలో జితేంద్రగౌడ్‌కు సమ ఉజ్జీగా ఉన్నారు. ఇక్కడ.. జనసేన తరపున.. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పోటీ చేస్తూండటంతో పరిస్థితి త్రిముఖ పోరుగా మారింది. నిజానికి గుప్తాను జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చేర్చారు. టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. చంద్రబాబు జితేందర్ గౌడ్‌కే చాన్సిచ్చారు. మూడు వర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గుప్తాకు నియోజకవర్గం వ్యాప్తంగా అనుచరవర్గం ఉంది. ఓట్లు చీలిపోతే… ఎవరికి నష్టం అన్నదానిపై అంచనా లేదు. వైసీపీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఇక్కడ కొద్ది తేడాతో అయినా వైసీపీ అభ్యర్థి బయటపడతారని అంచనా. కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని మార్చడం ప్లస్ పాయింట్ అవుతోంది. ఇక్కడ ఎంపీ జేసీ సూచించిన ఉమామహేశ్వరరానాయుడికి టీడీపీ టిక్కెట్ కేటాయించింది. వైసీపీ తరపున ఉషాశ్రీచరణ్ రెడ్డికిచాన్సిచ్చారు. టీడీపీ తరపున రెబల్‌గా నామినేషన్ వేసి… సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఉపసంహరించుకుని టీడీపీ కోసం పని చేస్తున్నారు. జేసీ కుటుంబం ఇక్కట టీడీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీకి సంస్థాగతంగా ఉన్న పట్టు, జేసీ బ్రదర్స్ రాజకీయంతో మరోసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మడకశిర ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కె.ఈరన్న, వైసీపీ అభ్యర్థిగా మోపురగుండు తిప్పేస్వామి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఈరన్న తన ప్రత్యర్థి తిప్పేస్వామిపై దాదాపు 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికైన నాలుగేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. వైసీపీ కూడా తమ ప్రత్యర్థి గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన ఎం. తిప్పేస్వామికే వైసీపీ అధిష్టానం మరోసారి అవకాశమిచ్చింది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు ఇతర అంశాలను చూసుకుంటే.. వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి .. వైసీపీ పరిస్థితి క్లిష్టంగా ఉంది. కొన్నాళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన సిద్ధారెడ్డికి టిక్కెట్ ప్రకటించారు. కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ఉన్న వజ్రభాస్కర్ రెడ్డి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఆయన జగన్ ఫోటోలతోనే ప్రచారం చేస్తున్నారు. మరో వైపు టీడీపీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా పూర్తి మద్దతు ప్రకటించారు. ఇక్కడ వైసీపీ వర్గ విబేధాలు టీడీపీకి కలసి వస్తున్నాయి. ఈ సారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరనుంది.
పెనుకొండ నియోజకవర్గంలో.. టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారధి మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శంకర్ నారాయమ పోటీ చేస్తున్నారు. జనసేన తరపున పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ పోటీ చేస్తున్నప్పటికీ.. పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మొదటి పరిటాల వర్గానికి కంచుకోట. ఈ సారి కూడా.. అది చేజారిపోయే అవకాశాలు లేవు. కియా కార్ల పరిశ్రమ ఈ నియోజకవర్గంలోనే రావడం మరింత అనుకూలంగా మారింది. ఉరవకొండ నియోజకవర్గంలో… ఎప్పుడైనా హోరాహోరీ పోరు నడుస్తుంది. గత ఎన్నికల్లో పయ్యావుల కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి ఆయనకు సోదరుడి నుంచే అసమ్మతి ఎదురయింది. నియోజకవర్గంలో.. అన్ని అభివృద్ధి పనులు.. ఎమ్మెల్సీ హోదాలో… పయ్యావుల చేతి మీదుగానే జరిగాయి. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో.. ఉరవకొండపైనే దృష్టి పెట్టి పని చేస్తున్నారు. అది సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో… జేసీ ప్రభాకర్ రెడ్డి …కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ.. జేసీ కుటుంబానికి పూర్తి స్థాయి పట్టు ఉంది. జేసీ కుటుంబంతో ఫ్యాక్షన్ గొడవలున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. కొంత మంది నేతలు… వైసీపీలో చేరినప్పటికీ… జేసీ మార్క్ రాజకీయంతో… కనీసం 20వేల మెజార్టీ సాధించనున్నారు. తాడిపత్రి మెజార్టీ.. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేసీ పవన్ రెడ్డి కి కీలకం. అందుకే.. ఈ సారి తాడిపత్రిపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టారు..జేసీ బ్రదర్స్.
శింగనమల నియోజకవర్గంలో… జేసీ దివాకర్ రెడ్డి పట్టుబట్టి మరీ సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలను తప్పించి… బండారు శ్రావణికి ఇప్పించారు. వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతికి అవకాశం కల్పించారు. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ.. తాడిపత్రిలో పోటీ చేస్తున్న పెద్దారెడ్డి వర్గానిది ఇక్కడ కీలక పాత్ర. ఆయన స్వగ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. అలాగే…ఆయనకతో ఫ్యాక్షన్ గొడవలున్న బోగాతి నారాయణరెడ్డి వర్గం కూడా వైసీపీలో ఉంది. రెండు వర్గాలు కలిస్తే.. శింగనమలలో వైసీపీకే చాన్స్ ఉంది. కానీ.. బోగాతి వర్గాన్ని టీడీపీ వైపు తిప్పేందుకు.. జేసీ ప్రయత్నిస్తున్నారు. రాత్రి వేళ్లలో సమావేశాలు పెడుతున్నారు. జేసీ ప్రయత్నాలు వర్కవుట్ అయితే.. శింగనమలలో మరోసారి టీడీపీ జెండా ఎగురుతుంది. లేకపోతే.. వైసీపీకి చాన్స్ వస్తుంది. ఇప్పటికి అయితే… కేతిరెడ్డి, బోగాతి వర్గాలు వైసీపీకే పని చేస్తున్నాయి కాబట్టి.. వైసీపీకే అవకాశం ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మొదటగా.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. జేసీ సమీప బంధువు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ… జేసీ చొరవతో కాల్వకు మద్దతు ప్రకటించారు. వైసీపీ తరపున కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో… రాయదుర్గంలో కాస్త తేడా పరిస్థితులు ఉండేవి. అవి మళ్లీ అవసరంలేదన్న మాట నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది. కాల్వ.. సంక్షేమ పథకాలను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సారి కూడా కాల్వ శ్రీనివాసులే విజయం సాధిచనున్నారు.
రాఫ్తాడు నియోజకవర్గంలో… పరిటాల వర్గం పట్టు సడలలేదు. తోపుదుర్తి సోదరుల చేతికి అధికారం వెళ్తే.. నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్న భయం ప్రజల్లో ఉంది. ఈ సారి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తూండటంతో యువత కూడా.. మద్దతుగా నిలుస్తోంది. టీడీపీకి పట్టు ఉన్న గ్రామాల్లో పోలింగ్ తగ్గించేందుకు.. తోపుదుర్తి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ రోజు పరిణామాలు చాలా కీలకం. ఇక్కడ నుంచి పరిటాల శ్రీరాం.. అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో… మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎదురీదుతున్నారు. ఆయన పై అభివృద్ధి పరంగా కంప్లైంట్లు లేవు. కానీ.. టీడీపీలో వర్గ విబేధాలు.. ఇతర కారణాలతో.. వైసీపీ అభ్యర్థి డి.శ్రీధర్ రెడ్డి ఫేవరేట్ గా కనిపిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో… అభ్యర్థి విషయంలో వైసీపీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయింది. చివరికి.. కర్నూలుకు చెందిన మాజీ ఐజీ ఇక్బాల్ ను రంగంలోకి దింపారు. బాలకృష్ణ.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ… ఆయన అభివృద్ధి చేశారు. ముఖ్యంగా… హిందూపురం పట్టణానికి తాగునీటికొరత తీర్చారు. ఇది ఆయనకు కలసి రానుంది. ఇక్బాల్ స్థానికేతరుడు కావడంతో… బలిజ వర్గం వైసీపీకి దూరం కావడంతో… బాలకృష్ణ రెండో సారి ఎమ్మెల్యేగా గెలవనున్నారు.
ఇక అనంతపురం జిల్లాలో… ఫ్యాక్షన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. ఇక్కడ గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి.. నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు. ఆయన ప్రత్యర్థి.. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. దూకుడైన మాటలు, అసభ్య దూషణలతో.. ఇప్పటికే సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు. ఇక్కడ గ్రామాల్లో చిచ్చుపెట్టి.. ఫ్యాక్షన్ పెడితేనే… పోరు హోరాహోరీ సాగుతుంది. కానీ గత ఐదేళ్లలో పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గం ప్రశాంతంగానే ఉంది. జనసేన తరపున.. నిన్నామొన్నటిదాకా కీలకంగా వ్యవహరించిన మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన కొన్ని వైసీపీ ఓట్లను చీల్చుకుంటారన్న ప్రచారం ఉంది. ఎలా చూసినా.. వరదాపురం సూరికే ఎక్కు విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
Area | Party |
---|---|
రాయదుర్గం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
ఉరవకొండ | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
గుంతకల్లు | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
తాడిపత్రి | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
సింగనమల (ఎస్సీ) | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
అనంతపురం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
కళ్యాణదుర్గం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
రాప్తాడు | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
మడకశిర (ఎస్సీ) | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
హిందూపురం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
పెనుకొండ | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
పుట్టపర్తి | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
ధర్మవరం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
కదిరి | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |