జిల్లాల వారీగా తెలుగు360 అందిస్తున్న సర్వే వివరాల్లో చిట్ట చివరిది కర్నూలు జిల్లా. ఇప్పటి వరకు..ఏ పార్టీపైనా సానుభూతితో ఈ సర్వే చేయలేదు. నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే ఫలితం ప్రకటిస్తున్నాం. ఏ సర్వే అయినా అందరికీ నచ్చదు. అందులో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే నచ్చుతుంది. మిగిలిన వాళ్లు విమర్శిస్తారు. అంతిమంగా ప్రజాతీర్పును గౌరవించడమే ముఖ్యం. కర్నూలు జిల్లాలో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందో… సర్వే ఫలితాలను చూద్దాం..!
కర్నూలు జిల్లాలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో… మొత్తం పధ్నాలుగు స్థానాల్లో వైసీపీ పదకొండు చోట్ల, టీడీపీ మూడు చోట్ల విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని బలమైన వర్గాలున్న నేతలందరూ.. టీడీపీలో చేరిపోయారు. కొంత మందిని స్వయంకృతంతో.. జగన్ వదులుకోగా… మరికొంత మంది… జగన్ తీరు నచ్చక బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. వైసీపీ పరిస్థితి కాస్త దిగజారినట్లుగా కనిపించింది. అదే సమయంలో .. నేతల పరంగా.. బలహీనంగా ఉన్న టీడీపీకి.. నేతల చేరికతో కొత్త బలం వచ్చి చేరింది. టీడీపీ బలానికి..ఆయా అభ్యర్థుల వ్యక్తిగత బలం తోడవడంతో… పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ తరపున టీజీ భరత్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున హఫీజ్ ఖాన్ పోటీ చేస్తున్నారు. జనసేన కూటమి తరపున అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ.. పెద్దగా ప్రభావం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా… ఎస్వీ మోహన్ రెడ్డి స్వల్ప తేడాతో టీజీ వెంకటేశ్ పై విజయం సాధించారు. ఆ తర్వాత సమీప బంధువు భూమా టీడీపీలో చేరడంతో… జగన్.. ఈయనను కూడా పట్టించుకోవడం మానేశారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. అయితే.. టీడీపీ అంతర్గత సర్వేలో టీజీ భరత్‌కే ఎక్కువ సానుకూలత రావడంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. అయితే.. ఆయన టీడీపీలోకి వచ్చినప్పుడు కానీ.. వెళ్లినప్పుడు కానీ.. ప్రత్యేకంగా క్యాడర్‌ను తీసుకురావడం.. తీసుకెళ్లడం జరగలేదు కాబట్టి… మైనస్ ఏమీ లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గతంలో టీజీ వెంకటేష్ టీడీపీ తరపున ఓ సారి.. కాంగ్రెస్ తరపున ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పరిచయాలు, బలమైన వర్గంతో పాటు.. సంక్షేమ పథకాలు.. టీడీపీకి కలసి వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి హాఫిజ్ ఖాన్ జారిపడి గాయంతో.. నాలుగురోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఎలక్షనీరింగ్ పై ప్రభావం చూపనుంది. మొత్తంగా.. ఇక్కడ నుంచి టీజీ వెంకటేష్ తన కుమారుడ్ని అసెంబ్లీకి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆదోని నియోజకవర్గంలో… 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వై.సాయిప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మీనాక్షినాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సాయిప్రసాద్ రెడ్డి.. మీనాక్షినాయుడుపై దాదాపు 17వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వారిద్దరి మధ్యనే పోరు సాగుతోంది. జనసేన తమ అభ్యర్థిగా శ్రీ మల్లిఖార్జునరావుని బరిలో నిలబెట్టింది. మీనాక్షి నాయుడు ఓడిపోయినప్పటికీ… నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం తరపున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇక్కడ మస్లిం ఓటర్లు కీలకం. గత ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో.. ఏకపక్షంగా.. వైసీపీకి పోలయ్యాయి. కానీ ఈ సారి ముస్లింలలోమార్పు కనిపిస్తోంది. ఇక్కడి మత పెద్దలకు.. ఢిల్లీ స్థాయి మత పెద్దల నుంచి … బీజేపీకి సహకరించే పార్టీలకు ఓటు వేయవద్దన్న సందేశాలు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే పలువురు.. మైనార్టీ నేతలు.. టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును దిద్దుకునేదుకు మీనాక్షి నాయుడు ముస్లింలకు అనేక హామీలిస్తున్నారు. అదే సమయంలో.. టీడీపీలో చేరిన కోట్ల కుటుంబానికి ఇక్కడ పట్టు ఉంది. కోట్లను చూసుకుని కాంగ్రెస్‌లో మిగిలిపోయిన నేతలంతా.. ఆయనతో పాటు టీడీపీలో చేరారు. ఇన్ని చేసినా… ఆదోనిలో పోరు హోరాహోరీగానే ఉంది. ఎడ్జ్ వైసీపీకే కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి ఫలితం మారొచ్చు.
డోన్ నియోజకవర్గంలో.. టీడీపీ తరపున కేఈ ప్రతాప్, వైసీపీ తరపున ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యానికి పెట్టింది పేరు డోన్ నియోజకవర్గం. కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. గత ఎన్నికల్లో కోట్ల వర్గం … బుగ్గనకు సహకరించింది. దాంతో.. ఆయన విజయం సులువు అయింది. కానీ.. ఈ సారి బుగ్గనకు.. కీలక అనుచరులు దూరమయ్యారు. కోట్ల-కేఈ వర్గాలు కలిసి పని చేస్తే.. ఈ నియోజకవర్గంలో.. టీడీపీ విజయం చాలా తేలిక. అయితే.. దశాబ్దాలుగా… వర్గ విబేధాలు ఉండటంతో… కోట్ల చేరికను జీర్ణించుకోలేని కొంత మందిని…బుగ్గన… వైసీపీలోచేర్చుకుంటున్నారు. జనసేన కూటమి తరపున అభ్యర్థి నిలబడినా ప్రభావం నామమాత్రమే. ఇక్కడ పోరు హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్ రోజు పరిణామాలను బట్టి ఫలితం తేలొచ్చు. ఇప్పటికి అయితే.. వైసీపీ అభ్యర్థి రాజేంద్రనాథ్ రెడ్డికి చాలా స్వల్పమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఇక భూమా కుటుంబం కంచుకోట అయిన… ఆళ్లగడ్డలో… టీడీపీ తరపున భూమా అఖిలప్రియ, వైసీపీ తరపున గంగుల కుటుంబ వారసుడు బ్రిజేంద్రనాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎప్పుడూ పార్టీలు ముఖ్యం కాదు. ఈ రెండు కుటుంబాల ఆధిపత్యపోరాటమే కీలక. అయితే… భూమా దంపతులు ఇద్దరూ లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో నాయకత్వ పటిమ చూపించాల్సిన అవసరం అఖిలప్రియపై పడింది. ఆమె అవసరానికి తగ్గ దూకుడుగానే ఉన్నారు. నియోజకవర్గంలో బలిజలు, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు భూమా కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఈ సారి కూడా ఆళ్లగడ్డలో భూమా కుటుంబమే జెండా ఎగరేయనుంది.
ఆలూరు నియోజకవర్గంలో… టీడీపీ తరపున కోట్ల సూజాతమ్మ, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వీరభద్ర గౌడ్.. 3వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ సారి ఆయన గెలుపు ఖాయమనుకున్నారు. కానీ.. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో… ఆలూరు సీటును వారికి త్యాగం చేయాల్సి వచ్చింది. ఐదు మండలాల్లో టీడీపీకి గట్టి పట్టు ఉంది. దేవనకొండ మండలంలో వైసీపీకి బలం ఉంది. కోట్ల వర్గం కూడా బలంగా ఉండటంతో.. ఇక్కడ ఈ సారి టీడీపీ జెండా ఎగురుతుందని సర్వేలో తేలింది. కర్నూలు జిల్లాలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం అయిన బనగానపల్లెలో… ఈ సారి పోటీ హోరాహోరీగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కానీ.. ఆయనకు ఈ సారి మద్దతిచ్చే వర్గాలు దూరమైపోయాయి. ముఖ్యంగా అవుకు మండలం మొత్తం గుప్పిట్లో పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. నిజానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డితో ఆయనకు ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయినా సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో చేరడానికి సిద్ధమైన బిజ్జం పార్థసారధి రెడ్డి అనే మరో నేతనూ చేర్చుకున్నారు. ఇక్కడ ప్రజలకు ఓట్లేసే సౌలభ్యం తక్కువ. గ్రామాలన్నీ.. వర్గాల గుప్పిట్లోనే ఉంటాయి. ఈ కారణంగా.. టీడీపీ అభ్యర్థికి విజయావకాశాలు సన్నగిల్లాయి. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపుబాటలో ఉన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నడుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ అభ్యర్థి తండ్రి… బీవీ మోహన్ రెడ్డి స్నేహితుడు. తర్వాత వారిద్దరూ.. రాజకీయ ప్రత్యర్థులయ్యారు. గత ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి … చెన్నకేశవరెడ్డినే పోటీ చేయమని.. జగన్ చెప్పడంతో.. ఆయన .. 80 ఏళ్లు దాటిన వయసులో… 30 ప్లస్ ఉన్న ఎమ్మెల్యేతో పోటీ పడుతున్నారు. జనసేన కూడా తమ అభ్యర్థిగా రేఖా గౌడ్ బరిలోకి దిగారు. ప్రభావం అంతంత మాత్రమే. చెన్నకేశవరెడ్డికి ఉన్న విస్తృతమైన పరిచయాలు, అనుభవంతో… జయనాగేశ్వరరెడ్డిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోరు హారాహోరీగా ఉంది. ఎడ్జ్.. వైసీపీకే ఉంది. సంక్షేమ పథకాల ప్రభావం ఓటర్లపై బాగా ఉంటే.. ఫలితం మారొచ్చు. కోడుమూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడు చేసినా.. అక్కడ మాత్రం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డిలదే ఆధిపత్యం. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఈ సారి అందరి ఆమోదంతో.. మాజీ ఐఏఎస్ బి.రామాంజనేయులుని తెరమీదకు తీసుకువచ్చారు. వైసీపీ తరపున డాక్టర్ సుధాకర్ బాబు పోటీచేస్తున్నారు. ఇక్కడ టీడీపీకే పూర్తి ఎడ్జ్ కనిపిస్తోంది.
మంత్రాలయం నియోజకవర్గం పేరులో పుణ్యక్షేత్రం ఉన్నప్పటికీ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గాల్లో ఒకటి. 2009లో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వై.బాలనాగిరెడ్డి … వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ మరణం తర్వాత ఈయన వైసీపీలో చేరి 2014లో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై 7వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున బాలనాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున తిక్కారెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారం తొలి నాళ్లలోనే జరిగిన ఘర్షణలో ఆయన కాలిలోకి బుల్లెట్ దిగడంతో…ఆయన అంబులెన్స్‌లోనే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఇది సానుభూతి తెచ్చి పెడుతోంది. అయితే… బాలనాగిరెడ్డి… గుప్పిట్లో పది గ్రామాల్లో కనీసం పదిహేను వేల ఓట్లు ఉన్నాయి. 90 శాతం.. బాలనాగిరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే పడతాయి. ఈ ఓట్లలో చీలిక వస్తే తప్ప… టీడీపీ అభ్యర్థి గెలవడం కష్టం. ఈ విషయంలో ఈ సారి కూడా తిక్కారెడ్డి సక్సెస్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇక్కడ వైసీపీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.
నందికొట్కూర్ నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ గుర్తుకు వస్తుంది. అయితే 2009లో ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ కింద కేటాయించారు. టీడీపీ తరపున బండి జయరాజు, వైసీపీ తరపున ఆర్థర్ పోటీ చేయస్తున్నారు. జనసేన కూడా తమ అభ్యర్థిగా అన్నపురెడ్డి బాల వెంకట్‌కు అవకాశమిచ్చింది. పోటీలో ఎవరు ఉన్నా… ఇక్కడ రెండు వర్గాలు మాత్రమే.. ఫలితాల్ని శాసిస్తూ ఉంటాయి. గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి వర్గాలు.. ఉప్పునిప్పులా ఉండేవి. వారు మద్దతిచ్చిన అభ్యర్థులే పోటీ పడుతూ ఉంటారు. అయితే.. అనూహ్యంగా చివరి దశలో ఇద్దరూ టీడీపీ గూటికి చేరారు. గౌరు సూచనతో బండి జయరాజుకు టీడీపీ హైకమాండ్ టిక్కెట్ కేటాయించింది. బైరెడ్డి కూడా మద్దతు పలికారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి విజయావకాశాలు మెరగుపడ్డాయి. అయితే.. బైరెడ్డి సోదరుని కుమారుడు సిద్ధార్థరెడ్డి వైసీపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థి ఆర్థర్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతో కొంత వర్గం.. వైసీపీ వైపు వెళ్లింది. అయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థికే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందారెడ్డి 27 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డితో పోటీ పడుతున్నారు. ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి జనసేన తరపున బరిలో ఉన్నారు. భూమాకు… ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి ఫరూక్ మద్దతు పలుకుతూండటంతో.. పరిస్థితులు సానుకూలంగా మారాయి. పరిస్థితి హోరాహోరీగా ఉన్నా… ఎడ్జ్ మాత్రం స్వల్పంగా అయినా టీడీపీకే మొగ్గు ఉంది. ముస్లింలలో కొంత శాతం.. ఈ సారి వైసీపీపై అసంతృప్తితో ఉండటమే దీనికి కారణం.
పాణ్యం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన గౌరు చరితారెడ్డిని.. జగన్ అవమానించడంతో..ఆమె వర్గం అంతా.. టీడీపీలో చేరింది. ఇప్పుడు టీడీపీ తరపునే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి… వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. అనూహ్యమైన పరిస్థితుల్లో వర్గపోరాటంలో ప్రత్యర్థులుగా ఉన్న బైరెడ్డి.. టీడీపీకి మద్దతు ప్రకటించడంతో.. పాణ్యంలో… గౌరు చరిత గెలవడానికి సులభమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పాణ్యం ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా సహకరిస్తున్నారు. జనసేన నుంచి చింతా సురేష్ పోటీ చేయనున్నారు. ప్రధాన పోటీ .. టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది .. కానీ… వైఎస్ ఆత్మీయులు అయిన గౌరు కుటుంబమే టీడీపీ నుంచి మరోసారి శాసనసభలో అడుగుపెట్టనుంది.
పత్తికొండ నియోజకవర్గం కేఈ కుటుంబం కంచుకోట. ఈ సారి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన కుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. 30వేల ఓట్లు తెచ్చుకున్న చెరుకులపాడు నారాయణరెడ్డి.. తర్వాత వైసీపీలో చేరారు. కానీ.. ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన సతీమణి శ్రీదేవికి జగన్ టిక్కెట్ ప్రకటించారు. కానీ నారాయణరెడ్డి వర్గం మొత్తం కోట్ల వర్గమే. సానుభూతి కలసి వస్తుందని..జగన్ ఆశించారు కానీ.. అలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ.. కేఈ కుటుంబ వారసుడు తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. శ్రీశైలం నియోజవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 2016లో టీడీపీలో చేరారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కూడా బుడ్డాకే టిక్కెట్ కేటాయించారు. పార్టీలు మారి మళ్లీ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అయితే… రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ … నామినేషన్ల సమయంలో రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. నియోజకవర్గంలో ఎస్సీ, ముస్లీం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. టీడీపీ.. బీజేపీ నుంచి బయటకు రావడంతో ముస్లీం మైనార్టీల్లో టీడీపీకి కొంత ఆదరణ పెరిగింది. పోరు హోరాహోరీగా ఉంది. ఇద్దరి మధ్య తేడా చాలా స్వల్పమే. కానీ…ఇప్పటికైతే ఎడ్జ్ మాత్రం.. వైసీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డికి ఉంది. పోలింగ్ రోజు పరిణామాలతో పరిస్థితులు మారొచ్చు.
Area | Party |
---|---|
ఆళ్లగడ్డ | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
శ్రీశైలం | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
నందికొట్కూరు (ఎస్సీ) | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
కర్నూలు | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
పాణ్యం | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
నంద్యాల | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
బనగానపల్లె | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
డోన్ | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
పత్తికొండ | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
కోడుమూరు (ఎస్సీ) | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
ఎమ్మిగనూరు | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
మంత్రాలయం | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
ఆదోని | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
ఆలూరు | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |