Click here for తెలుగు 360 సర్వే : శ్రీకాకుళంలో పోటాపోటీ ..! ఎడ్జ్ ఆ పార్టీకే..!
తెలుగు 360 నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో… అంచనాకు వచ్చిన అంశాలను బట్టి… రోజుకో జిల్లాకు చెందిన సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నాం. తొలి రోజు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషించాం. ఈ రోజు విజయనగరం జిల్లాకు చెందిన ఫలితాలు ఎలా ఉంటాయో… చూద్దాం.
విజయనగరం జిల్లాలో మొత్తం.. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఆరు చోట్ల, వైసీపీ మూడు చోట్ల విజయం సాధించింది. కురుపాం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఇందులో బొబ్బిలి జనరల్. మిగిలిన రెండూ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బొత్స కూడా ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసీపీ మంచి పలితాలు సాధించింది. అయితే.. ఆ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారాయి. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అదే సమయంలో… బొబ్బిలి రాజులు… తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో.. బలాబలాలు తారుమారయ్యాయి. ఓ వైపు.. అశోక్ గజపతిరాజు బలం, మరో వైపు.. బొబ్బిలిరాజుల అనుచరగణానికి తోడు.. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం ఉండటం.. టీడీపీకి ప్లస్ పాయింట్. బొత్స కుటుంబానికే… మూడు టిక్కెట్లు కేటాయించడం… వైసీపీలో వర్గ విబేధాలు… ఒకరికొకరు సహకరించుకోకపోవడం… వైసీపీకి మైనస్ పాయింట్.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో.. అశోక్‌గజపతిరాజు కుటుంబానికి కంచుకోట. ఆయన 1978 నుంచి కేవలం ఒక్క సారి మాత్రం.. అదీ కూడా చాలా స్వల్పంగా.. వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఆయన కుమార్తెను రంగంలోకి దింపారు. మచ్చలేని వ్యక్తి కావడం, సామాన్యుల్లో సామాన్యుడిగా గడపడంతో పాటు.. వారసురాల్ని తెరపైకి తీసుకు రావడంతో… ప్రజలు ఆదరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో .. అశోక్‌గజపతిరాజు మద్దతుతో భారీ విజయం సాధించిన మీసాల గీత.. అసంతృప్తికి గురయినప్పటికీ.. ఆమెకు బుజ్జగించారు. దాంతో.. అదితీగజపతిరాజు విజయానికి ఆమె సహకిస్తున్నారు. ఇక బొబ్బిలి నియోజకవర్గంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, వైసీపీ తరపున మాజీ టీడీపీ నేత శంబంగి చినఅప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుజయ్ కృష్ణ రంగారావుకు అన్నీ సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి.. వైసీపీ ముఖ్య నేత బొత్స పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా… కిమిడి నాగార్జునను.. టీడీపీ బరిలోకి దింపింది. టిక్కెట్ ఆశించిన త్రిమూర్తులు రాజు, గద్దె బాబూరావులను చంద్రబాబు బుజ్జగించారు. వారు సహకరిస్తే… బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరు. సమన్వయలోపం తలెత్తితే మాత్రం బొత్స సొమ్ము చేసుకుంటారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. బొత్సకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఎస్.కోట నియోజకవర్గంలో… టీడీపీ పూర్తిగా అడ్వాంటేజ్ సాధించింది.అక్కడ టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి ఉన్నారు. ఆమె అందరికీ అందుబాటులో ఉండటం… క్యాడర్ నుంచి సంపూర్ణ ఆమోదం పొందడంతో… తిరుగులేని పరిస్థితికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న కడుబండి శ్రీనివాస్‌కు.. ఆ పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. పలుమార్లు సమన్వయకర్తల్ని మార్చడంతో క్యాడర్లో స్తబ్ధత ఉంది. మౌత్ టాక్ కోళ్ల లలిత కుమారి గెలుపైనే ఉండటంతో..కడుబండి డీలా పడిపోయారు. నెల్లిమర్లు నియోజకవర్గంలో.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ హోరాహోరీ తలపడుతున్నారు. టీడీపీ తరపున సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడు పోటీ చేస్తూండగా… వైసీపీ తరపున బొత్స బంధువు బడ్డకొండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. అయితే.. నెల్లిమర్లకు నిన్నామొన్నటిదాకా పెన్మత్స స సాంబశివరాజు కన్వీనర్ గా ఉండేవారు. ఆయనను అవమానకరంగా తప్పించజంతో.. ఆయన వర్గం దూరంగా ఉంటున్నారు. గతంలోనూ.. బొత్స అలాగే చేయడంతో.. ఈ సారి అప్పలనాయుడును ఓడించాలని పట్టుదలగా ఉన్నారు.
గజపతినగరం నియోజకవర్గంలో.. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఉండగా.. వైసీపీ తరపున బొత్స సోదరుడు బొత్స అప్పలనర్సయ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం.. కేఏ నాయుడు సోదరుడే పోటీ పడటంతో..అక్కడ టీడీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితి ఉంది. అలాగే.. బొత్స సోదరుడ్ని కూడా.. వైసీపీలో కొంత మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లోనూ… ఎవరు గెలుస్తారో చెప్పలేనంత బిగ్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరడంతో.. ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. జనసేన ప్రభావం.. అంత తీవ్రంగా ఉండకపోయినా.. ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
కురుపాం | ( ఎస్టీ ) | టీడీపీ |
---|---|---|
పార్వతీపురం | ( ఎస్సీ ) | వైసీపీ |
సాలూరు | ( ఎస్టీ ) | టీడీపీ |
బొబ్బిలి | టీడీపీ |
|
చీపురుపల్లి | వైసీపీ |
|
గజపతి నగరం | వైసీపీ |
|
నెల్లిమర్లు | టీడీపీ |
|
విజయనగరం | టీడీపీ |
|
శృంగవరపు కోట | టీడీపీ |