రాగాల సరాగాల తడిసి ముద్దయ్యే వెన్నెల పాటసారి. తీయ తేనియలోలికే మాధుర్యభరిత గీతాలైనా, సన్నివేశానికి తగ్గ మాటలనైనా హృదయంగా మలచే అక్షర శిల్పి ఆయన. ఇంటిపేరులోనే వెన్నెల చల్లదనాన్ని నింపుకున్న సృజనశీలి. స్ట్రెయిట్ చిత్రాలకూ, డబ్బింగ్ చిత్రాలకూ సరిసమానంగా ప్రతిభ చాటిన సుకవి. ఆయనే వెన్నెలకంటి. వెన్నెలకంటి ఇంటిపేరుతో సుప్రసిద్దులైన ఆయన ఒంటి పేరు రాజేశ్వర ప్రసాద్. సుమారు రెండు వేలకు పైగా గీతాలు రాసిన ఆయన కన్ను మూసారు. ఇన్నాళ్లూ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్న ఆయన పెన్ను మూత పడింది. చెన్నయ్ లోని ఆయన ఇంటిలో గుండెపోటుతో మృతి చెందారు.
వెన్నెలకంటి మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వెన్నెలకంటి ఇక లేరనే వార్త దిగ్బ్రాంతి కలిగిస్తోందని సాహితీకారులు సైతం నివాళి ఘటిస్తున్నారు. ఇంతమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన వెన్నెలకంటి కి సంబంధించిన వ్యక్తిగతాన్ని ఓసారి స్పృశిస్తే..
1957 నవంబర్ ౩౦ న జన్మించారు. భార్య ప్రమీలాకుమారి. కుమారుడు శశాంక వెన్నెలకంటి కూడా సినిమాల్లో రచన చేస్తున్నారు. రెండో కుమారుడు రాకేందు మౌళి. వెన్నెలకంటి చిన్నప్పటి నుంచి హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం పట్ల ఆసక్తి కనపరిచాడు. ఆ వినికిడి జ్ఞానమే సృజనకు అంకురార్పణ చేసిందని ఆయన నమ్ముతారు. నెల్లూరు లో పట్టభద్రుడయ్యాక 1979లో చంద్రగిరి స్టేట్ బ్యాంకులో కొన్నాళ్ళు ఉద్యోగం చేసారు.
కళాశాల లో చదువుతున్నప్పుడు ఆకాశవాణిలో ప్రసారమయ్యే రసవినోదిని కార్యక్రమాలు ఏంతో ఇష్టంగా వినేవారు. 1975లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన కవితల పోటీలో ఏకంగా 9 కవితలు సెలెక్ట్ కావడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు.
జంధ్యాల రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాల్లో ఆయన నటించారు. సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో శ్రీ రామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసారు. ఆ తర్వాత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ద్వారా అన్నాచెల్లెళ్లు చిత్రంలో పాట రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. నాయకుడు సినిమాతో డబ్బింగ్ సినిమా రచయితగా కూడా ప్రతిభ చూపించారు.
వెన్నెలకంటి ఇదా ప్రపంచం, మహర్షి, చెట్టుకింద ప్లీడరు, భార్గవ్, తేనిటీగ, ఏప్రిల్ 1 విడుదల, ఆదిత్య 369, స్వాతి కిరణం, అల్లరి ప్రియుడు, వన్ బై టు, ముగ్గురు మొనగాళ్లు, భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం, దెయ్యం, శీను, సమరసింహా రెడ్డి, అన్నయ్య, నర్సింహా నాయుడు, చంద్రముఖి, ఒక్క మగాడు… ఇలా చాల చిత్రాల్లో గీతాలు రాసారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన బృదావనం చిత్రంలో మధురమే సుధాగానం, ఓహో ఓహో పావురమా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఆదిత్య 369 చిత్రంలో రాసలీల వేళలో పాట ఇప్పటికీ జనం నాలుకలపై కదలాడుతూనే ఉంది. అలాగే, ఆయన ఖాతాలో మాట రాని మౌనమిది పాట చాలా గొప్ప పాట.
తన అక్షరాలని గీతాలుగా మలచి రసహృదయాలను ఎంతగానో అలరించిన వెన్నెలకంటి సినీ పాటలున్నంతవరకూ చిరంజీవి. ఆయన పాటలకు మరణం లేదు.