కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటున్న మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వం మీద బడ్జెట్ కేటాయింపులపై పార్టీ స్ధాయిలో తెలుగుదేశం మొదటిసారిగా అసంతృప్తిని ప్రకటించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి కూడా అసంతృప్తి వెలిబుచ్చారు. గత రెండు బడ్జెట్ లలో ”అడిగినవి రాలేదు ..ఇంకా ఇచ్చి వుంటే బాగుండేది” ఈ స్ధాయిలోనే వ్యాఖ్యానాలు వుండేవి. మొదటిసారిగా ఇపుడు పార్టీస్ధాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. పాలిట్ బ్యూరో సమావేశం ద్వారా ఈ విషయాన్ని రికార్డు చేశారు.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-17 సంవత్సరపు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతగా ప్రాధాన్యత లేదని తెలుగుదేశం పొటిట్ బ్యూరో అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రబాబునాయుడి అధ్యక్షతన విజయవాడలో .జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపుల పట్ల ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని వివరించిన ఆయన బడ్జెట్ లో రాష్ట్రానికి ఇతోధిక కేటాయింపులు ఉంటాయని ఆశించామన్నారు. అయితే బడ్జెట్ తమ అంచనాలకు భిన్నంగా, రాష్ట్రంపై చిన్న చూపు చూసిందన్నారు.
బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య మిత్రధర్మంలో మొహమాటాలు బిగుసుకుంటున్నాయనడానికి ఇది ఒక సంకేతం. తెలంగాణాకు సంబందించినంతవరకూ గత బడ్జెటు కంటే ఈ బడ్జెట్టు నయమని ఎంపి కవిత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పాలిట్ బ్యూరో మాత్రం తెలంగాణాపై బడ్జెట్ ప్రభావం మీద ఎలాంటి అభిప్రాయమూ వెలిబుచ్చలేదని తెలిసింది.
బడ్జెట్ పై భారత కార్పొరేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడింది. కార్పొరేట్ టాక్స్ రేట్ తగ్గింపునకు ఎంతగానో ఎదురు చూశామని అయితే మినహాయింపులు ఎలా అన్న విషయంలో మరింత స్పష్టత ఉంటుందని భావించామని ఫిక్కి అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటా అన్నారు. కార్పొరేట్ టాక్స్ ను 25 శాతం తగ్గిస్తామని అరుణ్ జైట్లీ మాట్లాడినప్పుడు దానిపై ఎంతో చర్చ జరిగిందని బడ్జెట్ లో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమూ, ఆశాభంగమూ అని పేర్కొన్న సీఐఐ అధ్యక్షుడు సుమిత్ ముజుందార్ వ్యాఖ్యానించారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ, సరళీకరణ చేసి ఉంటే వ్యాపార, వాణిజ్య రంగాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేదని అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు.
బడ్జెట్ లో పన్ను ప్రతిపాదనలు కలగూరగంపలా ఉన్నాయని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ లో అబ్బో అనడానికి వీలైనదీ ఏదీ లేదని వారు పేర్కొంటున్నారు. పరోక్ష పన్నుల ద్వారా 20, 600 కోట్లు వస్తాయన్న ప్రభుత్వ లక్ష్యంపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నడూ పరోక్ష పన్నుల వసూలు లక్ష్యం ఎన్నడూ సాధ్యపడలేదని చెబుతున్నారు. పరోక్ష పన్నల ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళిక ఆచరణలో సాధ్యం కాదని ఖైతాన్ కంపెనీకి చెందిన దినేష్ అగర్వాల్ అన్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్త్ర రంగాల నుంచి అదనపు రాబడి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ఈ రోజు అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఆశావహ దృక్ఫథంతో ఉందని మాత్రమే చెప్ప గలమని కెపిజిఎం ఇండియాకు చెందిన గిరీష్ వన్ వారి పేర్కొన్నారు. అంతకు మించి పన్ను విధానంలో ఎటువంటి కొత్తదనమూ లేదని అన్నారు. ఆర్థిక మంత్రి జైట్లీ మరెంతో చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.అయితే మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఇది మంచి బడ్జెట్టేనని ఆయన చెప్పారు.