తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. బడ్జెట్ ఆమోదించుకోవడం కోసం ఒక్క రోజు సమావేశం పెట్టాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇరవై తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్క రోజే గవర్నర్ ప్రసంగం.. సంతాప తీర్మానాలు , బడ్జెట్ ప్రసంగం.. బడ్జెట్ ఆమోదం.. ఇలా అన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చ లేకుండా బడ్జెట్ సమావేశాలేమిటని ప్రశ్నించింది. అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వని సభకు హాజరవ్వాల్సిన అవసరం ఏమిటని టీడీపీ ప్రశ్నించింది.అందుకే బాయ్ కాట్ చేస్తున్నట్లుగా.. ఆ పార్టీ నేతలు ప్రకటించించారు.
నిజానికి బడ్జెట్ సమావేశాలు కొన్ని రోజులు నిర్వహించుకోవడానికి తగినంత సమయం ఉంది. గవర్నర్ మూడు నెలల బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. జూన్ నెలాఖరు వరకూ అది ఉపయోగపడుతుంది. ఈ లోపు బడ్జెట్ సమావేశాలు పెట్టి ఆమోదించుకోవచ్చు. కానీ.. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఆరు నెలల్లోపు ఓ సారి నిర్వహించాల్సి ఉంది. లేకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఆ సమయం.. ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ఈ కారణంగా ముందస్తుగానే నిర్వహించేసి.. ఒక్క రోజులోనే అన్ని పనులు పూర్తి చేయాలనుకున్నారు.
ఇప్పుడు ఒక్క రోజు నిర్వహిస్తే మరో ఆరు నెలల వరకూ నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అందుకే.. ఒక్క రోజు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి టెన్త్ పరీక్షలు పెడతామని ఎందుకు అంటున్నారని.. సహజంగానే విపక్షాలు మొదటి ప్రశ్నగా సంధిస్తున్నాయి.