దేశంలోని హిందూ ఆలయాలన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళతాయా? ఆ ఆలయాల బాగోగులు కేంద్రం చూసుకుంటుందా? వాటి సంరక్షణ బాధ్యత కేంద్రానిదేనా? హిందూ ఆలయాలకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు పనేమీ ఉండదా? …ఏమిటీ ప్రశ్నలన్నీ ? ఎవరు ఎవర్ని అడిగారు? ఇవి ప్రశ్నలే కాదు, సందేహాలు కూడా. ఇవన్నీ శ్రీపీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త, బీజేపీ అనుకూలుడు (మరోమాటలో చెప్పాలంటే నాయకుడు కూడా) స్వామి పరిపూర్ణానంద చెప్పిన సమాచారంతో ముందుకొచ్చిన ప్రశ్నలు. సందేహాలు. ఇంతకూ ఆయన ఏమన్నాడు? దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నాడు. కేంద్రంలో ఉన్నది హిందూత్వ భావజాలం దండిగా ఉన్న పార్టీ కాబట్టి అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో.
ఇలా ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికే హిందూ ఆలయాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతోందని పూరిపూర్ణానంద చెప్పాడు. ఇందుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు చేస్తున్నట్లు స్వామీజీ చెప్పిన సమాచారం. త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయట…! తమిళనాడులోని చిదంబరం ఆలయం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని స్వామీజీ సెలవిచ్చాడు. కేంద్రం ఇలాంటి బిల్లు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో ఇప్పటివరకు వార్త వచ్చిన దాఖలాలు లేవు. తెచ్చినా తేవచ్చేమో చెప్పలేం.
ప్రధాని మోదీ చేసే పనులు చివరిక్షణం వరకు తెలియవు. నోట్ల రద్దు, జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు….ఇలాంటివన్నీ జరిగేదాకా ఎవ్వరికీ తెలియకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది కేంద్రం. మహారాష్ట్రలో రాత్రికి రాత్రే పావులు కదిపి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఎవ్వరైనా ఊహించారా? కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలకు, దిగ్గజ పాత్రికేయులకు కూడా ఇసుమంత ఉప్పందలేదు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్లు ఇలాగే ఉంటాయి. హిందూ ఆలయాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటుందని పరిపూర్ణానంద చెప్పిన సమాచారం పక్కానో, కాదో తెలియదు.
ఆయన బీజేపీకి చెందిన ఆధ్యాత్మికవేత్త కాబట్టి కేంద్రంలో జరిగే కొన్ని విషయాలు ఆయనకు తెలుస్తాయని అనుకోవచ్చు. చిదంబరం ఆలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఆయన చెబితేనే తెలుస్తోంది. ఇది ఎప్పుడు జరిగిందో మరి. ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం కేంద్రం దాన్ని స్వాధీనం చేసుకుందో…! ఇతర రాష్ట్రాల సంగతి అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద లేదా ప్రధాన ఆలయాలు, ఆదాయం ఎక్కువగా వచ్చే ఆలయాలన్నీ దేవదాయ ధర్మదాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఆ శాఖ అధికారులదే పెత్తనం. ఇక తిరుమల వెంకన్న ఆలయం సంగతి చెప్పక్కర్లేదు. దాని పరిపాలన, దాని వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఉంటాయి. అదో సామ్రాజ్యం. దానికో ప్రత్యేక చట్టముంది. పాలకమండలి ఉంది. పాలక మండలి పదవి ముఖ్యమంత్రి పదవితో సమానంగా భావిస్తారు. ఆ ఛైర్మన్ పదవి దక్కించుకోవడానికి ఎంతమంది పోటీ పడతారో తెలియంది కాదు. ఆ పదవి లభించినవారు సంతోషసాగరంలో ఈదులాడుతుంటారు. జన్మ ధన్యమైపోయిందంటారు. శ్రీవారి సేవలో తరస్తామంటారు.
తిరుమలను వాటికన్ సిటీలా చేస్తామని గతంలో పాలకులు చెబుతుండేవారు. అంటే దానికో స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలనే ఆలోచన కావొచ్చు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టను తిరుమల స్థాయిలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని పనులు చేయిస్తున్నారు. దాని పేరును ఆయనకు ఆరాధనీయుడైన చినజీయర్ స్వామి ‘యాదాద్రి’గా మార్చారు. దీన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తానంటున్నాడు కేసీఆర్. టీవీ ఛానెళ్ల పుణ్యమా అని కొన్నేళ్లుగా జనంలో భక్తి విపరీతంగా పెరిగిపోయి ఆలయాలకు పోటెత్తున్నారు. పెద్ద ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చలేవా? కేంద్రం వీటిని స్వాధీనం చేసుకొని ఏం చేయగలదు? అసలు అలా చేయడం సాధ్యమేనా? నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లేదో ప్రవేశపెడితేగాని అసలు స్వరూపం అర్థమవుతుంది.