ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడిలో రూ.180 కోట్ల వ్యయంతో తాత్కాలిక సచివాలయం నిర్మించడానికి ప్రతిపాదనలు చేసినప్పుడు, ఓ తాత్కాలిక భవనం కోసం అంత ప్రజాధనం దుబారా చేస్తున్నందుకు చాలా విమర్శలు వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా మరో 200-300 కోట్లు ఖర్చుతో దానిపైనే మరో రెండు అంతస్తుల నిర్మాణానికి పూనుకొంది. అంటే తాత్కాలిక సచివాలయంపై సుమారు 400-500 కోట్లు ఖర్చు చేస్తోందన్న మాట! అందులోనే సచివాలయం, శాసనసభ, విధాన సభ, వివిధ ప్రభుత్వ సంస్థల కమీషనరేట్స్ ఏర్పాటు చేస్తున్నందున అంత ఖర్చు సమంజసమేనని రాష్ట్ర ప్రభుత్వం సర్ది చెప్పుకొంటోంది. రాజధాని నిర్మించిన తరువాత కూడా ఆ తాత్కాలిక సచివాలయాన్ని ప్రభుత్వం వేరే అవసరాలకు ఉపయోగించుకొంటుందని కనుక దానిపై పెడుతున్న బారీ ఖర్చు వృధా కాదని మునిసిపల్ మంత్రి నారాయణ చెపుతున్నారు. కానీ ఇంతకంటే చాలా గొప్పగా కట్టిన భవనాలకే మరమత్తుల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వం, తరువాత ఎప్పుడో ఈ తాత్కాలిక సచివాలయాన్ని యధాతధంగా ఉపయోగించుకొంటుందని ఆశిస్తే అవివేకమే అవుతుంది. తరువాత ఎప్పుడైనా దానిని ప్రభుత్వం ఉపయోగించుకొంటుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ దానిపై మరో 370 కోట్లు ఖర్చు చేయడానికి సిద్దం అవుతోంది. దానిలో 250 కోట్లు ఏసీలు, ఆఫీస్ ఫర్నీచర్ తదితర సామాగ్రి కొనుగోలుకి, రూ.120 కోట్లు రహదారులు, మంచి నీళ్ళు, మురికి కాలువలు, తదితర మౌలిక వసతుల కల్పనకి కేటాయించినట్లు సమాచారం. ఆ పనుల కోసం టెండర్లు కూడా పిలిచారు కనుక అంత ఖర్చు చేయడం కూడా వాస్తవమేనని భావించవచ్చు. అంటే ఇప్పుడు తాత్కాలిక సచివాలయం ఖరీదు ఇంచుమించుగా రూ. 870 కోట్లు అనుకోవచ్చు. అది రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దానిలో సగం కంటే ఎక్కువే.
ఒక తాత్కాలిక భవనానికే ఇన్ని వందల కోట్లు ఖర్చయితే శాశ్విత భవనాలకు ఇంకెంత అవసరమో ఊహించడం కూడా కష్టమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దుబారా ఖర్చులు చేస్తోందని రాష్ట్ర భాజపా నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఆ కారణంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం లేదని వాదిస్తున్నారు. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక తాత్కాలిక కట్టడంపై ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులలో పూర్తయ్యే అవకాశాలు లేనందునే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత పరిస్థితులలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై అంత బారీ ఖర్చు చేస్తోందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.