ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. ఇరవై ఎకరాలలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల సచివాలయ భవనం నిర్మాణానికి అనుమతిస్తూ మునిసిపల్ శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 180 కోట్ల వ్యయంతో ఈ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దానిలో వడ్డీ లేని రుణంగా ప్రభుత్వం రూ.90 కోట్లు సీ.ఆర్.డీ.ఏ.కి ఇస్తుంది. మిగిలిన రూ.90 కోట్లు హడ్కో సంస్థ నుంచి స్వల్ప వడ్డీతో రుణంగా పొందవలసి ఉంటుంది. సచివాలయ నిర్మాణానికి సీ.ఆర్.డీ.ఏ. త్వరలోనే టెండర్లు పిలువబోతోంది. దానిలో ప్రధాన షరతు ఏమిటంటే 2016 జూన్ నాటికల్లా సచివాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలి.
ప్రభుత్వం చేతిలో మాస్టర్ ప్లాన్ సిద్దంగా ఉంది కనుక ఇదే సొమ్ముతో ఆ మాస్టర్ ప్లాన్ లో సూచించిన ప్రదేశంలోనే శాశ్విత సచివాలయ భవన నిర్మాణం చేసుకొనే అవకాశం ఉండగా, రూ.180 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయం ఎందుకు నిర్మించాలనుకొంటోందో తెలియడంలేదు. ఇంత బారీ మొత్తం వెచ్చించి కొత్తగా తాత్కాలిక సచివాలయం నిర్మించాలనుకొంటున్న ప్రభుత్వం, రాజధానిలో శాశ్విత సచివాలయం నిర్మించబడిన తరువాత ఈ భవనాన్ని ఏమి చేస్తుందో? దేనికి వినియోగిస్తుందో? లేక అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇమడదని కూల్చి వేస్తుందో తెలియదు. ఈ విషయాల గురించి కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులలో వివరించి ఉంటే ఇటువంటి సందేహాలకు అవకాశం ఉండేది కాదు.