వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజే పది లక్షలకు మందికిపైగా టీకాలు వేశారు. ఆదివారం పూట ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టుకుని దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయాలనుకున్నారు. దీని కోసం వైద్య ఆరోగ్య శాఖ అవిశ్రాంతంగా శ్రమించింది. మొత్తంగా పధ్నాలుగు లక్షల డోసుల్ని జిల్లాలకు పంపి.. ఒక్క రోజే.. వాటిని ప్రజలకు వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏర్పాట్లు పూర్తి చేసి..ఆదివారం ఉదయం నుంచి.. వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మధ్యాహ్నం మూడు గంటల కల్లా.. పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో దేశం మొత్తం ఏపీ వైపు చూసినట్లయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఒకే రోజు.. పది లక్షల మంది టీకాలు ఇవ్వలేదు. అసలు ఆరు లక్షల టీకాలు కూడా ఇవ్వలేదు. ఏపీ సర్కారే.. గతంలో ఈ రికార్డును కూడా సృష్టించింది. ఒకే రోజు ఆరు లక్షల మందికి టీకాలు ఇచ్చింది. తమ రికార్డును తాము అధిగమించాలన్న లక్ష్యంతో ఈ సారి పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అంత కంటే ఎక్కువగానే టీకాలు సరఫరా చేశారు. కొద్ది రోజులుగా.. రాష్ట్రాలకు.. కేంద్రం టీకాలు పంపిణీ చేస్తోంది. పూర్తిగా ఉచితంగా మార్చిన తర్వాత .. టీకాల సరఫరా ఎక్కువగా అయింది.
ఇటీవలి కాలంలో కేంద్రం పంపిన టీకాలన్నీ..నిల్వ ఉంచారు. కొద్ది రోజులుగా ఏపీలో చాలా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగడం లేదు. రికార్డు సృష్టించాలన్న ఉద్దేశంతో అందరికీ.. స్లిప్లు ఇచ్చి ఆదివారం వేయించుకోవాలన్నారు. దాని ప్రకారం.. ఆదివారం రికార్డు స్థాయిలో టీకాలు పూర్తి చేశారు. ఏపీ సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పారు.