సియాచిన్ పర్వత శిఖరంపై గస్తీ ఉన్న 10మంది భారత జవాన్లు మంచు తుఫానులో చిక్కుకొని చనిపోయారు. దీనిని ప్రధాని నరేంద్ర మోడి దృవీకరించారు. సుమారు 19,600 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంగా పేరొందింది. అక్కడ కాపలాగా ఉన్న మద్రాస్ రేజిమెంటుకి చెందిన తొమ్మిది మంది సైనికులు, ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ మంచు తుఫానులో చిక్కుకొని రెండు రోజుల క్రితం మరణించారు. పెద్ద పెద్ద మంచు దిబ్బల క్రింద పడి వారు అందరూ చనిపోయారు. అతికష్టం మీద ఆ మంచు దిబ్బలను తొలగించి వారి శవాలను క్రిందకు తీసుకువచ్చేరు. వారి శవాలను కుటుంబ సభ్యులకు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కుటుంబ సభ్యులకు ముందుగా తెలియజేసిన తరువాతనే మరణించిన సైనికుల పేర్లు, వివరాలు మీడియాకు తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
“సైనికుల మృతి చెందడం చాలా బాధ కలిగిస్తోంది. దేశం కోసం పనిచేస్తూ తమ ప్రాణాలు ఒడ్డిన ఆ వీర జవాన్లు అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను,” అని ప్రధాని నరేంద్ర మోడి నిన్న ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు.