నాకు తెలియకుండానే పార్టీ పెట్టి పదేళ్లయింది అని పవన్ కల్యాణ్… ఇటీవల ఓ కామెంట్ చేశారు. నిజమే.. జనసేన పెట్టి పదేళ్లయిది., ఈ పదేళ్లలో ఏం సాధించారు…? అని ఆలోచిస్తే… ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఉంది. ట్విట్టర్లో రెండు మిలియన్ల ఫాలోయర్లు తప్ప.. గ్రౌండ్లో ఎదిగింది లేదు. ఎదగడానికి ప్రయత్నించిది లేదు. చివరికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పార్టీకి కేటాయించిన సమయం నెలకు రెండు, మూడు రోజులు మాత్రమే. పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తూ… ప్రజలంతా తన వెంట ఉండాలని.. తనను సీఎం చేయాలని పవన్ కోరుతున్నారు. పదేళ్ల తర్వాత అయినా పవన్ పరిస్థితిని అర్థం చేసుకున్నారా ? రాజకీయాలను రాజకీయంలాగే చేసే ప్రయత్నం చేస్తున్నారా ?
పార్టీ పెట్టిన తర్వాత అన్నీ నిలకడ లేని నిర్ణయాలు !
పదేళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు గుర్తుందా.. దారంతా… చీకటి… రోడ్డంతా గోతులు.. చేతిలో చిరుదీపం.. గుండెల నిండా ధైర్యంతో ముందడుగు వేస్తున్నా అని పవన్ కల్యాణ్ సినిమా స్టైల్ డైలాగులు చెప్పవచ్చు కానీ.. పార్టీ పెట్టి ఓ కూటమికి మద్దతు ప్రకటించేశారు. ఇక అందులో గోతులెక్కడుతున్నాయి.. చిరుదీపం అవసరమేముంది. తర్వాత అయినా సక్రమంగా రాజకీయంగా చేశారా అంటే అదీ లేదు. నాలుగేళ్లు ప్రభుత్వం దగ్గర కావాల్సినంత గౌరవం పొంది.. తనకంటే ప్రజా సమస్యలు పరిష్కరించేవారు లేరన్నట్లుగా వీకెండ్లో తన దగ్గరకు వచ్చిన వారిని చంద్రబాబు వద్దకు పంపి ఆ సమస్యలు పరిష్కరింపచేసి.. తానే పరిష్కారకర్త ఊహించుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎవరో చెప్పారంటూ ప్రభుత్వంపై నిందలేసి తిరుగుబాటు ప్రారంభించారు. చివరికి ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి రంగంలోకి దిగి పరువు పోగొట్టుకున్నారు.
ఎన్నికల రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా రాజకీయాలు !
రాజకీయాలు చేయాలంటే ఎన్నికలపై అవగాహన ఉండాలి. కానీ పవన్ కు అదే లేదు. నామినేషన్ వేస్తే చాలు ఓట్లు గుద్దేస్తారనుకుంటారు. కానీ రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయి మొత్తానికి విఫల నేతగా నిలబడ్డారు. ఆ రెండు నియోజవకర్గాలను మళ్లీ పట్టించుకోలేదు. 2014 లో తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ తాను మాత్రం సీట్లు తీసుకోకుండా ఉండిపోయారు. అప్పుడే కొన్ని సీట్లు తీసుకుంటే కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. ఓ రకంగా ఆదిలోనే మొదటి తప్పు జరిగిపోయింది. తర్వాత మారలేదు. తర్వాత ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో వర్కవుట్ కాకపోవడంతో వెంటనే బీజేపీ దగ్గరకు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు బీజేపీకి దూరంగా .. ఓట్ల చీలనివ్వబోం కానీ సీఎం పోస్టు కావాలని రాజకీయం చేస్తున్నారు.
గెలవబోం కానీ ఓడిస్తాం అనే రాజకీయాులు ఇంకా ఎంత కాలం ?
పదేళ్ల తర్వాత కూడా పవన్ పార్టీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. అధికారం మనదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో “అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం..” అనే దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికీ ఓ పార్టీని ఆపడానికి ఇంకో పార్టీతో కలిసి వెళ్లాలా.. లేక ఇంకో పార్టీని ఆపి తానే ముందుకు రావాలా అన్న సందిగ్ధం దగ్గరే జనసేనాని ఆగిపోయారు. పదేళ్ల తర్వాత కూడా పార్టీని ఇలా సందిగ్ధంలోనే ఉంచడం కచ్చితంగా లోపమే. జనసేనలోనే రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో ఉన్నారో లేదో తెలీదు. కానీ ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీ వల్ల వాళ్లకి వచ్చే లాభం ఏం లేదు. కింది స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదు. కనీసం మిగతా పార్టీల్లో ఇమడలేని నాయకులను ఆకట్టుకునే చాతుర్యం కూడా లేదు.
కులముద్ర వేసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నం !
కర్ణాటకలో జేడీఎస్ లా అవుదామని ఎవరైనా బ్రెయిన్ వాష్ చేశారేమో కానీ ఇప్పడు కాపు కుల ముద్ర తనపై వేసుకునేందుకు పవన్ సిద్దమవడం కొత్త ఉత్పాతం. ఓ రాష్ట్ర స్థాయి నేతగా ఓ కుల ముద్ర వేసుకునేందుకు పవన్ సిద్ధంగా లేరు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాని సమూహాలు కలవాలని ఆయన చెబుతున్నారు. ఇక్కడా క్లారిటీ ఉండదు. ఏ కులం మీటింగ్ పెడితే ఆ కులానికి అధికారం రావాలంటారు. ఎలా చూసినా పవన్ కల్యాణ్ తన పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదు.. వెనక్కి లాగుతున్నారు. అది ఎప్పటికప్పుడు విచిత్రంగా సాగుతూనే ఉంది.