రివ్యూలపై మరో దర్శకుడికి కోపం వచ్చింది. `రాసేవాళ్లు సినిమాలు తీయండి.. ఆస్కార్‌కి పంపించుకోండి. అవార్డులు కొట్టండి` అని వీరలెవిల్లో స్పీచులు ఇచ్చారు. ఆ దర్శకుడే.. జి.నాగేశ్వరరెడ్డి. ఆయన కోపానికి రీజన్ ఏమిటంటే.. ఆయన దర్శకత్వంలో వచ్చిన `తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్` కి సరైన రేటింగులు రాలేదు. ఈ సినిమాలో విషయం లేదని సమీక్షకులంతా తేల్చేశారు.
దాంతో నాగేశ్వరరెడ్డి చిందులు తొక్కారు. సినిమా విడుదలై నాలుగ్గంటలు కాకమునుపే ప్రెస్ మీట్ పెట్టి `మా సినిమా హిట్టు` అని చెప్పుకున్న నాగేశ్వరరెడ్డి – రివ్యూలు మాత్రం బ్యాడ్‌గా వచ్చాయని ఫీలయ్యారు. మేం శంకరాభరణం, సాగర సంగమం సినిమాలు తీయలేదని, ఇది అవార్డు సినిమా కాదని, కేవలం నవ్వించడానికే సినిమాలు తీశామని, నవ్వుల సినిమాకి రేటింగు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కామెడీ సినిమాలకు రేటింగులు వద్దన్నది నిజంగా మితండ వాదన. ఏ సినిమాకైనా విమర్శకులకంటూ ఓ దృష్టి కోణం ఉంటుంది. ఆ కోణంలోంచే చూస్తారు. రేటింగులు ఇస్తారు. రివ్యూలంటే ఇష్టం లేనప్పుడు `అసలు రివ్యూలెందుకు` అని అడగొచ్చు. అందులో అర్థం ఉంటుంది. కానీ… ఫలానా సినిమాలకు రేటింగులు ఇవ్వకూడదు అని మాత్రం చెప్పకూడదు. పైగా నాగేశ్వరరెడ్డి తీసినవన్నీ కామెడీ సినిమాలే. కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు కూడా రేటింగుల గురించి ఈయన ఇలా మాట్లాడలేదే..? సినిమాలో విషయం ఉంటే, నిజంగా నాగేశ్వరెడ్డి చెప్పినట్టు థియేటర్లో జనం పగలబడినవ్వుతుంటే, ఈ రేటింగులు ఈ సినిమాని ఆపలేవు. రెండ్రోజులు ఆగితే, బాక్సాఫీసు కలక్షన్లే అసలు నిజాన్ని బయట పెడతాయి.