హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇవ్వాళ్ళ మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైస్ ఛాన్సిలర్ అప్పారావు అధ్యక్షతన ఇవ్వాళ్ళ ఉదయం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో నిర్వహిస్తున్న అకాడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసారు. రోహిత్ మృతికి కారకుడయిన వైస్ ఛాన్సిలర్ అప్పారావు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని విద్యార్ధులు కోరుతున్నారు. వారికి యూనివర్సిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు కూడా మద్దతు పలుకుతున్నారు. అకాడమిక్ సమావేశంలో పాల్గొన్న యూనివర్సిటీ పరీక్షల నిర్వాహకుడు ప్రొఫెసర్ కృష్ణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇంకా అప్పారావు వైస్ ఛాన్సిలర్ గా కొనసాగడాన్ని నిరసిస్తూ తను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రొఫెసర్ కృష్ణ చెప్పారు.
యూనివర్సిటీ లోపల పరిస్థితులు ఇలాగ ఉంటే, అదే సమయంలో వేముల రోహిత్ మృతిపై హైకోర్టులో విచారణ మొదలయింది. ఈ కేసులో పిటిషనరుగా ఉన్న దామోదర్ రెడ్డి పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లో ఏ-1 నిందితుడిగా ఉన్న వైస్ ఛాన్సిలర్ అప్పారావు తక్షణం ఆ పదవిలో నుంచి తొలగించాలని కోరగా, న్యాయస్థానం ఆయనతో విభేదించింది. కొందరు వ్యక్తుల పిర్యాదు మేరకు పోలీసులు వైస్ ఛాన్సిలర్ అప్పారావుపై కేసు నమోదు చేసి, ఎఫ్.ఐ.ఆర్.లో ఏ-1 నిందితుడిగా పేర్కొనంత మాత్రాన్న ఆయనే రోహిత్ మృతికి కారకుడని ఏవిధంగా చెప్పగలరు? ఆయనపై కోర్టులో విచారణ చేసి దోషి అని నిర్దారించకమునుపే, ఆయనని పదవిలో నుంచి ఎందుకు తొలగించాలని న్యాయస్థానం పిటిషనర్ ని ప్రశ్నించింది. యూనివర్సిటీకి చెందిన ఏ నిబంధనల ప్రకారం ఆయనని పదవి నుంచి తప్పించవచ్చో చెప్పమని ప్రశ్నించింది. న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు, చట్టాల ప్రకారం పనిచేస్తాయి తప్ప వ్యక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తీర్పులు చెప్పావని స్పష్టం చేసింది. ఈ కేసుపై సమగ్ర సమాచారంతో మళ్ళీ కోర్టుకి హాజరుకమ్మని పిటిషనర్ ని ఆదేశిస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్ యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ నియంత్రణ, పరిధిలోనే ఉన్నప్పటికీ దానిలో నెలకొన్న ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు అది గట్టిగా కృషి చేస్తున్నట్లు కనబడటం లేదు. యూనివర్సిటీలో చాలా మంది విద్యార్ధులు, ప్రొఫెసర్లు కూడా వైస్ ఛాన్సిలర్ అప్పారావు తీరుపట్ల తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం వెనుకంజ వేస్తుండటంతో యూనివర్సిటీ రావణకాష్టంలాగ రగులుతూనే ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే, ఏదో ఒకరోజు మరో కొత్త సమస్య పుట్టుకు రావచ్చును. అప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లవుతుంది.