జనసేన అధినేత పవన్ కల్యాణ్ తునిలోని దివీస్ పరిశ్రమను తరలించాలనే ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అది కూడా.. ఆయన బయలుదేరడానికి కొద్ది గంటల ముందు. దీంతో వివాదం ఏర్పడింది. రాజకీయ కారణాలతోనే ఇలా చేశారని.. తాము పర్యటించి తీరుతామని.. ఏం చేసుకుంటారో.. చేసుకోండన్నట్లుగా… జనసేన నేతలు ప్రకటనలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ కూడా.. తాను వస్తున్నానని.. ఒకే ఒక్క వాక్యంతో తేల్చేశారు.దీంతో పోలీసుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఇప్పటికే..విపక్ష నేతల మీద పోలీసుల ప్రయోగం అధికంగా ఉందని.. హక్కుల్ని హరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటే అది మరింత వివాదానికి దారి తీసే పరిస్థితి ఉంది. జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి… పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా… భారీ సభను విజయవంతం చేస్తారు. అప్పుడు కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే జరిగితే.., మరింత రాజకీయ రచ్చ అవుతుంది. ఈ పరిణామాలన్నింటితో… పర్మిషన్ ఇవ్వడమే మంచిదని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మొదట అనుమతి నిరాకరించమని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు… ఆ పని చేసిన ఉన్నతాధికారులు.. తర్వాత మళ్లీ… పర్మిషన్ ఇవ్వాలని సంకేతాలు రావడంతో హతాశులయ్యారు. ఈ వ్యవహారంతో… కంగారు పడ్డారో… ఏమో కానీ… పవన్ కల్యాణ్ పర్యటన పూర్తయ్యే వరకూ… రెండు రోజుల పాటు.. తాను సెలవులో వెళ్తున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు.
పవన్ పర్యటనకు.. తన సెలవుకు సంబంధం లేదని… వ్యక్తిగత సెలవుపై వెళ్తున్నానని ఆయన చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు …రాజకీయ వ్యూహాలు అమలు చేయడమే పెద్ద టాస్క్‌గా మారిందన్న విమర్శలు పెరిగిపోతున్న సమయంలో పవన్ కల్యాణ్ టూర్ విషయంలో వ్యవహరించిన వైఖరి.. మరింత వివాదాస్పదమవుతోంది.