గత ఐదేళ్లలో అధికారులం అన్న సంగతి మరిచి వైసీపీతో అంటకాగిన ఆఫీసర్లకు కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు దడ పుట్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను గుర్తించి పోస్టింగ్ ఇవ్వకుండా పనిష్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ..మరికొంతమంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. తాజాగా జగన్ రెడ్డి సొంత జిల్లా కడప ఆర్జేడీ రాఘవరెడ్డిపై సర్కార్ వేటు వేసింది. ఆయనను బదిలీ చేయడమే కాకుండా, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో విచారణకు ఆదేశించింది. ఇది వైసీపీ అనుకూల అధికారులను టెన్షన్ పెట్టిస్తోంది.
రాఘవరెడ్డి గత ఐదేళ్లలో అధికారిని అనే సంగతి మరిచిపోయారు. ప్రమోషన్ కోసమో, వైసీపీ నేతలను కాకా పట్టేందుకో కానీ జగన్ భజనలో పులకించిపోయారు. స్కూల్స్ లో జగన్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో రెచ్చిపోయారు. మహిళా ఉపాధ్యాయులతో అనుచితంగా వ్యవహరించడం..బదిలీలు, ప్రమోషన్స్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయనపై విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కలెక్టర్ , గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ విచారణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించినా అప్పట్లో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందటంతో రాఘవరెడ్డి పాపం పండినట్లు అయింది.కూటమి అధికారంలోకి రావడంతో రాఘవరెడ్డిపై విచారణ చేపట్టాలంటూ మంత్రి నారా లోకేష్ ను రాంగోపాల్ రెడ్డి కోరారు. ఇటీవల ఆయనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..ఆర్జేడీ బాధ్యతల నుంచి రాఘవరెడ్డిని తప్పించాలని బాధితులూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయనను తప్పించింది. రాఘవ రెడ్డిపై విచారణ అధికారిగా పాఠశాల విద్య అదనపు డైరక్టర్ ప్రసన్నకుమార్ ను నియమించారు. ఈ నెల 15,16వ తేదీలో ఆయనను విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు ఆందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.