కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమ తీవ్రతను మరోసారి పెంచేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఛలో అమరావతి పేరుతో పాదయాత్ర ప్రారంభించ తలపెట్టారు. కాపుల రిజర్వేషన్ల విషయమై తాము సాగిస్తున్న ఆఖరి పోరాటంగా తాజా పాదయాత్రను అభివర్ణించారు ముద్రగడ. అయితే, పాదయాత్రకు మూడురోజుల ముందే పోలీసులు హడావుడి మొదలైపోయింది. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిని పోలీసులు రౌండప్ చేశారు. 144 సెక్షన్ ను అమల్లోకి తెచ్చారు. జిల్లా మొత్తం ఇదే సెక్షన్ అమలు చేయబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కిర్లంపూడి వెళ్లే దారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కిర్లంపూడి వైపు వెళ్తున్నవాహనాలను చెక్ చేస్తున్నారు. అంతేకాదు, స్వగ్రామస్థుల తప్ప… బయటివారిని కిర్లంపూడిలోకి అనుమతించడం లేదు. ఆ ఊరికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేసినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే కొంతమంది నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముద్రగడ ఉద్యమానికి పోలీసులు అనుమతి లేదనీ, పాదయాత్రకు సహకరించవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో ముద్రగడ చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది కాబట్టి, ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అనుమతులు ఇవ్వలేదనీ, హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలంటూ అధికారులు చెబుతున్నారు. మరోపక్క, కొంతమంది యువతకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
కిర్లంపూడిలో పరిస్థితులపై కాపు నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతుండటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. గాంధేయ మార్గంలో ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారనీ, ఓ వంద మంది పోలీసుల రక్షణగా ఉంటే ఈ యాత్ర శాంతియుతంగా సజావుగా సాగేదనీ, కానీ దీన్ని అడ్డుకోవడం కోసం వేల సంఖ్యలో పోలీసుల్ని రంగంలోకి దించాల్సిన పనేముందని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, లేదంటే యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే… తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర చేసి తీరతా అంటూ ముద్రగడ ప్రకటిస్తున్నారు. తనను పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే… అక్కడి నుంచే మళ్లీ యాత్ర కొనసాగిస్తాననీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ తన పాదయాత్రకు మద్దతు లభిస్తుందని ముద్రగడ అంటున్నారు. మొత్తానికి, పాదయాత్రకు మూడు రోజులే ముందు పోలీసుల హడావుడి మొదలైపోయింది! ఈసారి కూడా ముద్రగడను గృహనిర్బంధం చేస్తారా.. లేదా, మరోలా డీల్ చేస్తారా అనేది వేచి చూడాలి.