తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పడటం రాజకీయంగా కలకలంరేపింది. ఇంత వరకూ ఎవరూ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు మాత్రం గద్వాల జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇటిక్యాల మండలం వేముల వద్దకు చేరుకున్న పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయగా.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. మామూలుగా అయితే పోలీసులు ఇలాంటి నిరసనలు దగ్గరగా జరగనీయరు. కానీ అక్కడ జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరికి సద్దుమణిగినా.. ఏదో ఉద్రిక్త రాజకీయం జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేలా చేయడానికి ప్రయత్నం జరిగిందన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. బెంగాల్ లోనూ బీజేపీ నేతలపై ఇలా దాడులు జరిగాయన్న ప్రచారంతోనే సానుభూతి పెంచుకునేందుకు ప్రయత్నించారని అలానే ఇక్కడా ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
బీజేపీ నేతలు ఈ దాడి ఘటన జరిగిన వెంటనే మీడియా ముందుకు టీఆర్ఎస్ పై. విరుచుకుపడ్డారు. అయితే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకేమీ పట్టలేదని కేటీఆర్ తేల్చేశారు. దాడుల ప్రచారాలను బీజేపీ ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కేటీఆర్ ఆదేశించారు.