అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా..? హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ ను క్రాస్ ఓటింగ్ దారుణంగా దెబ్బతీయనుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలుస్తుందా..? అనే విమర్శల మధ్య కేసీఆర్ బస్సు యాత్ర ఆ పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చింది. మెదక్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లలో పార్టీ విజయం ఖాయమని లెక్కలు వేసుకుంది కానీ, ఆ పార్టీని క్రాస్ ఓటింగ్ దారుణంగా దెబ్బతీయనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ పై అసంతృప్తితో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అవలంభిస్తోన్న విధానాలనే అనుసరిస్తోందని వారంతా బీజేపీ వైపు టర్న్ అయ్యారన్న విశ్లేషణలు బీఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆధిపత్యం చెలాయించిన లీడర్లే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హస్తం పార్టీలో జాయిన్ కావడం ఓటర్లను ఆలోచనలోకి నెట్టేసింది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయంశాలే ఎజెండాగా ఉండటం, కాంగ్రెస్ – బీజేపీ మధ్య హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ ను ఓటర్లు లైట్ తీసుకున్నారని దాంతో మెజార్టీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ తమకు అనుకూలిస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటుండగా, బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తోన్న క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్ పట్ల శాపంగా మారుతుందన్న ప్రకారం జరుగుతోంది .
నాలుగు స్థానాల్లో గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నా..క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్ పుట్టి ముంచుతుందన్న వాదనలు బీఆర్ఎస్ ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి.