పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలని రేవంత్ సర్కార్ పట్టుదలతో ఉంది. రుణమాఫీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ పదేపదే అధికారులను ఆదేశిస్తున్నారు. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా మాట ఇవ్వడంతో గడువులోపు హామీని నెరవేర్చాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ లో కలవరం రేపుతోంది.
బీఆర్ఎస్ కు యువత దూరమైనా, రైతులు మాత్రం ఆ పార్టీకి మద్దతుగానే ఉన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి అయితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలే బీఆర్ఎస్ ను సెకండ్ టర్మ్ లో అధికారంలోకి తీసుకొచ్చాయి. అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయల రుణమాఫీపై నాలుగేళ్లు కాలయాపన చేయడం, చివర్లో 50వేలు మాత్రమే మాఫీ చేయడం బీఆర్ఎస్ పట్ల రైతుల్లో అసంతృప్తికి దారితీసింది.
ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపగా… రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ కాంగ్రెస్ కు కలిసివచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ ను ఇన్నాళ్లు ఆదరించిన రైతాంగం అంతా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అదే జరిగితే ఏ అంశాలతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది అని ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు.
ఇంతకాలం రైతు రుణమాఫీపై స్వరాన్ని వినిపిస్తూ కాంగ్రెస్ సర్కార్ ను బీఆర్ఎస్ విమర్శిస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఫలితం బీఆర్ఎస్ కు నిరాశజనకంగా ఉన్న , ఈ హామీ అమలైతే రేవంత్ సర్కార్ కు ఇది అడ్వాంటేజ్ గా మారనుండగా బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందిగా పరిణమించనుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందటంతో బీఆర్ఎస్ లో నైరాశ్యం కనిపిస్తోంది. నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే రైతు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ పునాదులు కూడా కదులుతాయని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.