హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ అనే దళిత విద్యార్థి నిన్న ఆత్మహత్య చేసుకున్న ఘటనతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోహిత్ మృతదేహాన్ని పోలీసులు తరలించకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని హాస్టల్లోనే ఉంచి గేట్లకు తాళాలు వేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పోలీసులు విద్యార్థులను నిలువరించే యత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళు విసిరారు. తక్షణమే క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలంటూ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు యూనివర్సిటీ అధికారులే కారణమంటూ అతని తల్లి ఆరోపించారు. తన కుమారుడి ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పేవరకు యూనివర్సిటీ వదిలి వెళ్ళనని, వీసీ వచ్చేవరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేయరాదని అన్నారు. తాను టైలరింగ్ చేస్తూ కొడుకును చదివించానని, తన కొడుకును సస్పెండ్ చేసి మనస్తాపానికి గురిచేశారని ఆరోపించారు.
వర్సిటీలో ఏబీవీపీకి, దళిత విద్యార్థులకు మధ్య జరిగిన గొడవల కారణంగా వీసీ ఐదుగురు విద్యార్థులపై సాంఘిక బహిష్కరణ వేటు వేశారు.. ఈ ఐదుగురిలో రోహిత్ ఒకరు. సాంఘిక బహిష్కరణను ఎత్తేయాలంటూ 14 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నా అధికారులు స్పందించలేదు. దీనితోనే రోహిత్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అతను మాత్రం తన మృతికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశారు. అతని చివరి లేఖ మనసులను కదిలించే విధంగా ఉంది. మనిషిని మనిషిగా చూడటంలేదని, కులాన్నిబట్టే చూస్తున్నారని రోహిత్ వాపోయారు. తన గురించి ఎవరూ కన్నీళ్ళు పెట్టుకోవద్దని కోరారు. రోహిత్ మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని తెలిసింది.