అగ్రిగోల్ వ్యవహారం అడుగడుగునా చిక్కుముళ్లతో ఎటూ తేలని సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. ఆ సంస్థ ఆస్తుల అమ్మకం ఎప్పుడు పూర్తయ్యేను, బాధితులకు సొమ్ము ఎప్పుడు తిరిగొచ్చేను అనే నిర్వేదం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కొంత ఊరట కలిగించే ఆదేశాలే ఇచ్చిందని చెప్పాలి. అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను వేలం వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం త్రిసభ్య కమిటీకి ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టరుతోపాటు, రిజిస్ట్రారు, జిల్లా న్యాయ విభాగ కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీతో ఆస్తుల వేలం ప్రక్రియ జరపాలని సీఐడీకి కోర్టు ఆదేశాలిచ్చింది. ముందుగా గుర్తించిన పది ఆస్తుల్లో, ఐదింటికి వేలం ప్రకటనలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఆరు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.
హైకోర్టు తాజా ఆదేశాలు అగ్రిగోల్డ్ బాధితులకు కొంత ఊరట కలిగించేవే అనొచ్చు. దీంతోపాటు ప్రభుత్వానికి కూడా కొంత టెన్షన్ తగ్గించే అంశమే అవుతుంది. దాదాపు 20 లక్షలమంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. చిన్న సన్నకారు రైతులతోపాటు వ్యాపారులు, మహిళలు కూడా బాధితుల్లో చాలామంది ఉన్నారు. గడచిన నాలుగేళ్లుగా వీళ్లకి ఎలా న్యాయం చేయాలనే కసరత్తు జరుగుతూనే ఉంది. అయితే, అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి… బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నా, ఆ ప్రక్రియకు అడుగడుగునా మోకాలడ్డు అన్నట్టుగానే పరిస్థితి మారింది. ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయనే ప్రచారం… ఇంకోపక్క ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉండటంతో ఈ వ్యవహారం మరింత చిక్కుముడిగా మారిపోయింది.
అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అధికార పార్టీ కాజేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేసిన సంగతే తెలిసిందే. అంతేకాదు, ఆ సంస్థ ఆస్తుల్ని కొనడానికి ఎవరైనా ముందుకొచ్చినా… ఏదో ఒక మార్గం ద్వారా ఒకరకమైన అభద్రతను వారిలో కలిగించే ప్రయత్నాలూ జరిగినట్టు ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. కొన్ని పార్టీలైతే… అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అనేది ఎన్నికల హామీగా కూడా మార్చేసి, ప్రచారం చేసుకుంటున్న పరిస్థితినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు బాధితులకు కొంత ఊరటను కలిస్తాయనే చెప్పొచ్చు.