న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త సీజే పీకే మిశ్రా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పంచ్ ప్రభాకర్ అనే ఓ బూతుల నేత విషయంలో చేసిన హెచ్చరికలు సీబీఐ పరువు పోయేలా చేశాయి. నిందితులకు కొమ్ము కాస్తున్నట్లుగా ఉందని ఆయన నేరుగా వ్యాఖ్యానించడంతో ఇక వారిని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కేసు ముందుకెళ్తే వైసీపీలోని ప్రముఖ నేతలకు ఇబ్బంది కలగడం ఖాయమని చెప్పుకోవచ్చు.
సీఐడీ చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు సీబీఐకి ఇచ్చింది. సీబీఐ కేసును టేకప్ చేసి ఏడాది గడుస్తున్నా అంతంతమాత్రమే చర్యలు తీసుకుంది. తమ అస్థిత్వానికి సంబంధించిన అంశం కావడంతో హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. అయినా సీబీఐ అంత చురుకుగా స్పందించలేదు. ఇప్పుడు ఆ కేసు మూలాలను కూడా వెలికి తీయాల్సిన పరిస్థితి సీబీఐకి ఏర్పడుతోంది. జడ్జిల కాల్ లిస్ట్ చెక్ చేయాలని.. వారు చంద్రబాబు చెప్పినట్లుగా తీర్పులు చెబుతున్నారని ఆరోపించిన ఎంపీ నందిగం సురేష్… ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మంత్రి అప్పల రాజు, స్పీకర్ తమ్మినేని సహా పదుల సంఖ్యలో వైసీపీ ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు.
హైకోర్టు 90మందికిపైగా నోటీసులు జారీ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డెడ్. సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు సీబీఐ…. న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు టీవీల ముందు.. రికార్డెడ్‌గా వారు ఆ విమర్శలు చేశారు. న్యాయవ్యవస్థపై దాడిని తేలిగ్గా తీసుకుంటే… ముందు ముందు మరింత మంది అలాంటి దాడులకు ప్రమాదం ఉందనే అభిప్రాయం అందటా వినిపిస్తోంది. అందుకే హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. సీబీఐ సీరియస్‌గా తీసుకుంటే .. అందులో ఉన్న కుట్ర మొత్తాన్ని బయటకు లాగడం పెద్ద విషయం కాదు. అంతా ఆర్గనైజ్డ్గా జరిగిందని భావిస్తున్న సమయంలో.. సీబీఐ ఎంత సీరియస్‌గా పని చేస్తే.. అంత సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. హైకోర్టు కొత్త సీజే ఈ కుట్రను వెలుగులోకి తెస్తే రాజకీయంగానూ సంచలనాత్మక కేసు అవుతుంది.