ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులిచ్చిన బ్యాంకర్లకు ఇప్పుడు వణుకు పుడుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెలవప్మెంట్ కార్పొరేషన్‌ను పెట్టి దానికి మద్యం పన్నును బదలాయించి… వాటినే ఆదాయంగా చూపి ప్రభుత్వం బ్యాంకర్ల వద్ద అప్పు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిగా ఉండి “ఎస్బీఐ క్యాప్” సంస్థ కమిషన్ తీసుకుంది. రుణాలు ఇప్పించడానికి “ఎస్బీఐ క్యాప్” ను ప్రభుత్వం నియమించుకుంది. ఆ సంస్థపని ఆ సంస్థ చేసింది. అయితే బ్యాంకర్లు తమకు తనఖా పెడుతున్నవన్నీ రాజ్యాంగబద్దమేనా… గ్యారంటీలు పనికి వస్తాయా అన్నదానిపై ఎలాంటి విచారణలు చేసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెలవప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం చెబుతోంది. అలాగే పన్నుల ఆదాయాన్ని నేరుగా ఆ కార్పొరేషన్‌కు తరలించడాన్ని కూడా రాజ్యాంగ ఉల్లంఘనగా చెబుతోంది. దీనిపై ఏపీ సర్కార్ వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం అధికారులు వర్కవుట్ చేస్తున్నారు. ఎలా రాజ్యాంగ విరుద్ధమో కాదో చెబుతూ.. కేంద్రానికి వివరణ పంపాల్సి ఉంది. కానీ ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా సమర్థించుకోవడం కష్టమవుతోందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉండటమే దీనికి కారణం. ఒక వేళ సమర్థించుకోలేకపోయినా… ఆ సమర్థనకు కేంద్రం సంతృప్తి పడకపోయినా … ఎపీఎస్డీసీని రద్దు చేయాల్సి ఉంటుంది లేదా నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ముందుగా బ్యాంకులతో చేసుకున్న ఒప్పందాలు చెల్లకుండా పోతాయి.
ఏపీఎస్డీసీకి సంబంధించి ఎలాంటి మార్పులు జరిగినా బ్యాంకర్లు ముందుగా నష్టపోతారు. మద్యంపై విధించిన అదనపు ఎక్సైజ్ పన్ను నేరుగా ఏపీఎస్డీసీకి అక్కడ్నుంచి బ్యాంకులకు రీ పేమెంట్‌గా వెళ్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కన్సాలిడేటెట్ ఫండ్‌కు మార్చాల్సి ఉంటుంది. అదేజరిగితే… ఒప్పందంలోని ప్రధానమైన మౌలికమైన షరతును ప్రభుత్వం ఉల్లంఘించిటన్లు అవుతుంది. అప్పుడు బ్యాంకులకు డబ్బులు వసూలు చేసుకోవడం తలకు మించిన భారం అవుతుంది. ప్రభుత్వం చెల్లించడం నిలిపివేసినా… ఏమీ చేయలేని పరిస్థితి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం… డిఫాల్ట్ అయితే… కోర్టులకూ వెళ్లలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఎలా ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నిస్తే.. బ్యంకులకు ఇబ్బందే.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రుణం చేసిన విన్యాసం అన్ని బ్యాంకులనూ వణికేలా చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏపీఎస్డీసీ వ్యవహారాలపై హైకోర్టులో పిటిషన్ వేశారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అప్పుడు విచారణలో కనీసం నోటీసులు కూడా జారీ చేయవద్దని అలా చేస్తే బ్యాంకులు అప్పులివ్వవని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరారు. అంత సున్నితమైన విషయం అని తెలిసినా కూడా .. ప్రభుత్వం.. బ్యాంకులు.. విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహారాలు నడపడమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ముందు ముందు ఈ అప్పు.. అనేక మంది అధికారుల పీకల మీదకు తేనుందని చెబుతున్నారు.