కోనసీమ జిల్లా పేరు మార్చడంపై ఆ జిల్లా మొత్తం అట్టుడికి పోతోంది. మెల్లగా ప్రారంభమైన ఆందోళనలు ఉద్ధృత స్థాయికి చేరాయి. చివరికి అవి రాళ్ల దాడులకు దారి తీశాయి. ఎస్పీ సుబ్బారెడ్డి సహా పలువురు పోలీసులపై దాడులకు దిగారు. అమలాపురం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఓ బస్సును ఆందోళన కారులు తగులబెట్టారు. పోలీస్ టెంట్లకు నిప్పు పెట్టారు. ఇరవై మందికిపైగా పోలీసులకు తీవ్రగాయాలయినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న అమలాపురంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండా ప్రజల భాగస్వామ్యం లేకుండా పేరు మార్చడంతో సమస్య ప్రారంభమయింది.
దీంతో కోనసీమను కోనసీమగానే ఉంచాలని అక్కడిప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జిల్లాల విభజన ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత హఠాత్తుగా ప్రభుత్వం పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కర్ఫ్యూ.. 144 సెక్షన్స్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదంతా అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతున్న వ్యవహారం అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీలేవీ జోక్యం చేసుకోవడం లేదు. కోనసీమ సాధన సమితి పేరుతో పేరు మార్చవద్దన్నఉద్యమం చేస్తూండటం.. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి నిరసనల్లో పాల్గొంటూండటంతో పరిస్థితి దారి తప్పు తోంది.