రీమేకులంటే వెంకటేష్‌కి ఎంతిష్టమో..? అగ్ర కథానాయకుల్లో ఆయన చేసినన్ని రీమేకులు ఎవరూ చేయలేదు. వాటితోనే హిట్లు కూడా కొట్టాడు. ఈసారి ఆయన దృష్టి `అసురన్`పై పడింది. తమిళంలో ధనుష్ చెలరేగి నటించిన సినిమా అది. తెలుగులో వెంకీ చేజిక్కించుకున్నాడు. ఈ చిత్రానికి `నారప్ప` అనే మాసీ టైటిల్ పెట్టాడు శ్రీకాంత్ అడ్డాల. దాంతో పాటు లుక్ కూడా వదిలారు.
తమిళంలో ధనుష్ లుక్‌కీ, వెంకీ లుక్ కీ అస్సలు తేడా లేదు. తలమీద చుట్టుకున్న కండువాతో సహా. కండువా రంగు కూడా మార్చడానికి వెంకీ ఇష్టపడలేదు. దాంతో… ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఓ అంచనాకు రావొచ్చు. మార్పులు, చేర్పులూ ఏమాత్రం ఉండవని, ఉన్నది ఉన్నట్టుగానే చూపించడానికి అటు హీరో, ఇటు దర్శకుడు ఇష్టపడుతున్నారన్నది అర్థం అవుతోంది. తమిళ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్లు వేరు, ఇక్కడి పద్ధతులు వేరు. ఈ విషయం వెంకీకి తెలియంది కాదు. మరి దాన్ని ఎలా బాలెన్స్ చేస్తాడో చూడాలి. అసలు ఈ కథకి శ్రీకాంత్ అడ్డాల సరైన దర్శకుడేనా? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయిపోవాల్సివచ్చినప్పుడు దర్శకుడు ఎవరైతే ఏమిటి? ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చి ఉంటుంది.