కశ్మీర్ ను మర్చిపోము.. అక్కడి ప్రజల పోరాటానికి సాయం చేస్తూనే ఉంటామని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కీలక వ్యక్తి ప్రకటన చేసి వారం రోజులు కాక ముందే దేశంపై దాడి చేశారు. కశ్మీర్ లోని పెహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులను కాల్చి చంపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రశాంతమైన పరిస్థితులు ఏర్పడటంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టెర్రరిస్టులు బలగాలు పట్టించుకోవడం లేదని అర్థం చేసుకున్నాక పంజా విసిరారు.
పెహల్గాం మంచి పర్యాటక ప్రాంతం. పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తారు. వేసవి ప్రారంభం అయిన తర్వాత ఇకా ఎక్కువ మంది వస్తున్నారు. స్థానికులు కూడా టూరిస్టుల వల్ల ఆదాయం పెరుగుతోందని సంతోషపడుతున్నారు. ఇలాంటి సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజా విసిరారు. ఓ గ్రూపుగా ఉన్న పర్యాటకులను మొత్తంగా బందీలుగా చేసుకుని వారి ఐడీ కార్డులు వెదికి మరీ హిందువులు అనుకున్న వారందర్నీ కాల్చి చంపేశారు.
కొత్తగా పెళ్లయిన జంటల్లో మగవాళ్లను టెర్రరిస్టులు చంపేశారు. హత్యాకాండ చేసిన తర్వాత వారు పర్వాతాల్లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు గాలింపులు చేపట్టాయి. ఈ విషయం పై కేంద్రం సీరియస్ గా స్పందిస్తోంది. అమిత్ షా వెంటనే శ్రీనగర్ కు వెళ్లారు. ఉగ్రవాదులపై దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనన్న లక్ష్యంతో ఉన్నారు.