పాకిస్తాన్ మంచిగా మారితే ఆశ్చర్యపోవాలిగానీ, దుష్ట పన్నాగం పన్నితే ఆశ్చర్యం ఏమీలేదు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాక్ ఐఎస్ఐ నేరుగా భవాల్ పూర్ నుంచి ముష్కరులను పంపించారు. ముందే సమాచారం ఉండటంతో భద్రతా దళాలు అప్రత్తంగా ఉన్నాయి. దాడికి వచ్చిన వారిని హతమార్చాయి. చర్చలంటూ షో చేసిన వారం రోజులకే పాక్ మరోసారి వెన్నుపోటు పొడిచింది.
క్రిస్మస్ నాడు ప్రధాని నరేంద్ర మోడీ హటాత్తుగా లాహోర్ లో పర్యటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాకిస్తాన్ గురించి తెలిసిన వారికి మరింత ఆశ్చర్యం కలిగింది. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదని చాలా మందికి అప్పుడే అర్థమైంది. మోడీ ప్రయత్నాన్ని మెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నా, అది ప్రయోజనం లేని ప్రయత్నమని పరిశీలకులు ముందే అంచనా వేశారు.
ఓ వైపు చర్చలని మాటలు చెప్తూ మరో వైపు తూటాలు పేల్చడం పాకిస్తాన్ కు అలవాటే.అణువణువునా భారత్ వ్యతిరేకతతో రగిలిపోయే పాకిస్తాన్, తాను నాశనమైనా భారత్ బాగు పడకూడదనుకునే దుష్ట దేశం. ప్రత్యక్ష యుద్ధాల్లో గెలిచే సత్తా లేక, ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతోంది.
ఇప్పుడు మోడీ అయినా, ఇంతకు ముందు వాజ్ పేయి అయినా వృథా ప్రయాస లాంటి ప్రయత్నం చేయడం మినహా ఒరిగింది ఏమీ లేదు. వాజ్ పేయి ఒకప్పుడు జరిపిన చర్చలు ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే, ముషారఫ్ ఒక్కడికే. అప్పటి వరకూ సైనిక నియంతగా ఉన్న ముషారఫ్ ను చర్చల కోసం వాజ్ పేయి ఆహ్వానించారు. ఏ హోదాలో వెళ్తారనే ప్రశ్న తలెత్తింది. అంతే, ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. అందుకోసం ఆనాటి వాజ్ పేయి ప్రయత్నం ఉపయోగపడింది. ముషారఫ్ దంపతులు భారత్ లో సరదాగా పర్యటించి వెళ్లారు. తాజ్ మహల్ ను సందర్శించారు. వాజ్ పేయి పాకిస్తాన్ పర్యటన వల్ల కూడా శాంతి నెలకొన లేదు. తర్వాతి కాలంలో షరా మామూలే.
మన్మోహన్ సింగ్ హయాంలో మరీ ఘోరం. మన సైనికుల తలలు నరికినా అడిగే దిక్కులేదు. అలాంటి పాకిస్తాన్ తో చర్చలు జరపడం వృథా. విద్వేషంతో తూటాలు పేల్చే వారికి మంచి మాటలు అర్థం కావు. కాబట్టి, వీలైనంతగా విరుచుకుపడి మనం కూడా దాడులు చేయడం ఒక్కటే మార్గమని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క దాడికి పది దాడులు అనే విధంగా కౌంటర్ అటాక్ ఉంటేనే పాకిస్తాన్ అదుపులో ఉంటుంది. మరోవైపు, కాశ్మీర్లో ఉన్న పాక్ అనుకూల శక్తులను అచ్చోసిన ఆంబోతుల్లా బయట తిరగకుండా చేయాలి. జాతీయ భద్రతా చట్టం కింద వారిని అరెస్టు చేసి జైలుకు పంపవచ్చు. అలా చేస్తే జాతి వ్యతిరేకతను వ్యాపింప చేయకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. ముఫ్తీ ప్రభుత్వం వేర్పాటు వాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ఆపేలా ప్రధాని మోడీ కటువుగా స్పందించక తప్పదు. ఇలా, ద్విముఖ వ్యూహంతోనే పాకిస్తాన్ కు చెక్ పెట్టగలం. చర్చలు జరిపితే మాత్రం కచ్చితంగా అది వృథా అనేది ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే పచ్చి నిజం.