హైదరాబాద్: దేశంలో మత అసహనం తీవ్రంగా పెరిగిపోతోందని షారుక్ ఖాన్ వ్యాఖ్యనించటం, దానిపై సంఘ్ పరివార్‌కు సంబంధించిన పలువురు మండిపడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయాద్ స్పందించాడు. షారుక్ సహా భారత్‌లోని ఏ ముస్లిమ్ అయినా ఇస్లాం కారణంగా ఇండియాలో కష్టంగా ఉందని భావిస్తే వారు పాకిస్తాన్‌కు వచ్చి నివాసం ఏర్పరుచుకోవాలని ఆహ్వానిస్తున్నామంటూ ట్వీట్ చేశాడు. భారత్‌లో ముస్లిమ్‌లపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని, భారత్ లౌకిక దేశంకాదనటానికి ఇదే నిదర్శనం అని అన్నాడు. భారత్ హిందూ ఛాందసవాద దేశమని ఆరోపించాడు. స్పోర్ట్స్, కళలు, విద్య తదితర రంగాలలో ఎంతో పేరు తెచ్చకున్న ముస్లిమ్‌లు తమ గుర్తింపుకోసం నిత్యమూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని ట్వీట్ చేశాడు.
మరోవైపు బీజేపీ సీనియర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ షారుక్ ఖాన్‌కు, హఫీజ్ సయీద్‌కు పెద్ద వ్యత్యాసం లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని మెజారిటీ ప్రజలు షారుక్ చిత్రాలను తిరస్కరిస్తే అతని ఇతర సాధారణ ముస్లిమ్లలాగే రోడ్లపై తిరగాల్సివస్తుందని అన్నారు. షారుక్ లాంటి జాతి వ్యతిరేకులు స్వరాన్ని పెంచుతున్నారని, దీనిని ఖండిస్తున్నామని చెప్పారు. షారుక్‌ను హఫీజ్ పాకిస్తాన్‌కు ఆహ్వానించటంపై స్పందిస్తూ, దానిని తాముకూడా స్వాగతిస్తున్నామని, షారుక్ కూడా దానిని పరిశీలించాలని అన్నారు. అలాంటివారందరూ అక్కడికే వెళ్ళాలని, అక్కడ వారికి అసలు పరిస్థితి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి యూపీలోని గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గీయకూడా షారుక్‌పై మండిపడ్డారు. షారుక్ ఇండియాలో నివసిస్తాడని, కానీ అతని మనసంతా పాకిస్తాన్‌లోనే ఉందని ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర సమాచార-ప్రసార శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. ఈ విషయంపై మాట్లాడటానికి కైలాష్ బీజేపీ అధికార ప్రతినిధి కాదని అన్నారు.