ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియా దేశాలలో కొన్ని నగరాలను లేదా ప్రాంతాలను ఆక్రమిస్తున్నట్లు తరచూ వార్తలు వింటూనే ఉంటాము. ఇప్పుడు అదేవిధంగా జమాత్ ఉల్ ఆహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ తాము లాహోర్ లోకి ప్రవేశించామంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి ఒక హెచ్చరిక సందేశం పంపింది. ఆ సంస్థ పాకిస్తాన్ లో అప్పుడప్పుడు దాడులకు పాల్పడుతూ తన ఉనికిని చాటుకొంటోంది. నిన్న గుల్షన్-ఏ-ఇక్బాల్ అనే పార్కులో మైనార్టీ వర్గానికి చెందిన క్రీస్టియన్లపై దాడులు చేసి 73మందిని పొట్టన పెట్టుకొన్నదీ తామేనని సగర్వంగా ఆ సంస్థ ప్రకటించుకొంది. అంతే కాదు ఇప్పుడు నేరుగా పాక్ ప్రదానికే సందేశం పంపే స్థాయికి ఎదిగిందని అర్ధమవుతోంది.
అయితే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఒక పెద్ద అడ్డాగా మారిందనే విషయం అందరికీ తెలుసు. కనుక ప్రస్తుతం ఉన్నవాటికి మరొకటి అదనంగా వచ్చి చేరిందని సరిపెట్టుకోవలసి ఉంటుంది. అవి సృష్టించే ఈ విద్వంసానికి పాకిస్తాన్ ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలి చేసుకోవలసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఆ ఉగ్రవాద సంస్థలను నిందించడం కంటే వాటి పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్న పాక్ ప్రభుత్వం తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. వాటిలో జైష్-ఏ-మొహమ్మద్ వంటి కొన్ని ఉగ్రవాద సంస్థల లక్ష్యం భారత్ కావడం చేత, వాటికి పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలభిస్తున్నాయి. అటువంటి కొన్ని ‘మంచి’ ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వమే అన్నివిధాల సహకరిస్తున్నప్పుడు, మిగిలిన ‘చెడ్డ సంస్థల’ పట్ల కటినంగా వ్యవహరించడం కష్టం కనుకనే మిగిలిన వాటిని చూసి చూడనట్లు ఊరుకోవలసి వస్తోంది. అలాగ ఊరుకోవడాన్ని అలుసుగా తీసుకొని మిగిలిన ఉగ్రవాద సంస్థలు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ఈవిధంగా విద్వంసం సృష్టిస్తుంటాయి. అప్పుడే వాటిని చూసి ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ సంస్థలు భయపడుతుంటారు. అప్పుడే అవి వారి నుంచి కావలసినంత డబ్బులు పిండుకోగలుగుతాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ కి అవి రకరకాల వాదాలను ముసుగులుగా వేసుకొంటాయి. బహుశః ఈ కారణంగానే ఆ దేశంలో రోజుకొక ఉగ్రవాద సంస్థ పుట్టుకొస్తోందని భావించవచ్చును.
అయితే ఈ సమస్యకు పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద సరయిన పరిష్కారం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో దాని వైఖరి మారదు. కనుక వేర్పాటువాదులకి, ఆ ముసుగులో ఉన్న ఉగ్రవాదులకి మద్దతు ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎవరయినా ప్రధాని అందుకు అంగీకరించకపోయినట్లయితే, ‘మంచి ఉగ్రవాదులకి’ వత్తాసు పలుకుతున్న సైనికాధికారులకి, ఐ.ఎస్.ఐ. ఉన్నతాధికారులకి, దేశంలోని మత ఛాందసవాదులకి ఆగ్రహం కలుగుతుంది. కనుక భారత్ ని ద్వేషించే మంచి ఉగ్రవాదులకు సహకరించక తప్పదు. ఆకారణంగా ఈ ఉగ్రవాద సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉండవచ్చును. అది ఎప్పటికయినా ఆరుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. పొరుగింటికి నిప్పు అంటుకొంటే అది మనకీ ఎప్పటికయినా ప్రమాదమే. కానీ ఆ మంటలను ఎవరూ ఆర్పలేరు కనుక మనం చేయగలిగిందేమిటంటే మన జాగ్రత్తలో మనం ఉండటమే.