జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాక్, ఐసిస్ జెండాల రెపరెపలాడటం, తరచూ ఉగ్రవాదుల దాడులు చేయడం ఇప్పుడు నిత్యకృత్యమయిపోయింది. ఇవ్వాళ్ళ ఉదయం జమ్మూ సరిహద్దు జిల్లా అయిన కుప్వారాలో తాంగ్ దార్ సెక్టార్ కల్సురి రిడ్జ్ అనే ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చిన్న సైజు బాంబులు, మారణాయుధాలతో భారత సైనిక దళాల మీద విరుచుకుపడ్డారు. వారి దాడిని భారతసేనలు సమర్ధంగా తిప్పి కొడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడిలో ఒక సైనికుడు మరణించినట్లు వార్తలు వచ్చేయి కానీ అది నిజం కాదని ఆర్మీ అధికారులు చెప్పారు. పాక్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ఈ తాంగ్ దార్ సెక్టార్ లోని కల్సురి రిడ్జ్ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగించుకొంటారని ఆర్మీ అధికారులు చెపుతున్నారు. ఇవ్వాళ్ళ కూడా ఉగ్రవాదులు భారత్ లోకి జొరబడేందుకే భారత్ సరిహద్దు భద్రతా దళాలపై దాడులకు పాల్పడి ఉండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
ఒకవైపు భారత్ పై ఈవిధంగా పరోక్ష యుద్ధం చేస్తూనే మరో వైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ కి చెందిన ‘రా’ తదితర నిఘావర్గాలు పాకిస్తాన్ లో గూడచర్యం చేస్తూ, ఉగ్రవాదుల దాడులకు వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితం ఇరు దేశాల సరిహద్దు భద్రతా దళాల ఉన్నతాధికారుల సమావేశం డిల్లీలో జరిగింది. ఇకపై సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలని, రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాలు కలిసి ఉగ్రవాదులను అడ్డుకోవాలని ఆ సమావేశంలో నిర్ణయించుకొన్నారు. కానీ ఆ మరునాటి నుండే షరా మామూలుగా సరిహద్దుల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ఈవిధంగా భారత్ సరిహద్దు భద్రతా దళాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వారి దాడిలో భారత సైనికులు తరచూ మరణిస్తూనే ఉన్నారు. ఎప్పటికయినా ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అంటే దానికి పాకిస్తాన్ చెపుతున్న పరిష్కారం ఏమిటంటే కాశ్మీర్ ని భారత్ వదులుకోవడమేనట! అది అసాధ్యం కనుక ఈ సమస్య కూడా ఎన్నటికీ పరిష్కరం కాదని స్పష్టమవుతోంది. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న అశాంతికి, అక్కడ నిత్యం జరుగుతున్న ఉగ్రవాదుల దాడులకి పాకిస్తానే మూలకారణమనే విషయం కూడా దీని వలన స్పష్టం అవుతోంది.