జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో పారంపోర్ అనే ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు నిన్న సి.ఆర్.పి.ఎఫ్. వాహనంపై దాడి చేసినప్పుడు ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు చనిపోయారు. మరో పదిమంది జవాన్లు ఆ దాడిలో గాయపడ్డారు. పాంపోర్ వద్ద తమ వాహనంపై దాడి చేసిన తరువాత పక్కనే ఉన్న ఎంట్రప్రిన్యూర్ డెవలప్మెంట్ భవనంలోకి ఉగ్రవాదులు జొరబడి దాక్కొన్నారని సి.ఆర్.పి.ఎఫ్.అధికార ప్రతినిధి బవీష్ చౌదరి తెలిపారు.
ఆ భవనంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినపుడు తామందరం భయంతో వణికిపోతుంటే వాళ్ళు “మా పోరాటం భద్రతాదళాలతోనే తప్ప మీతో కాదని చెప్పారు. లోపల ఉన్న మా అందరినీ బయటకు వెళ్ళిపొమ్మని చెప్పారు,” అని ఆ సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి మీడియాకి చెప్పారు. ప్రస్తుతం ఆ భవనంలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సి.ఆర్.పి.ఎఫ్.అధికార ప్రతినిధి చౌదరి చెప్పారు. భద్రతాదళాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. నిన్న సాయంత్రం నుంచి ఇంతవరకు కూడా వారికీ, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భద్రతాదళాలు మరికొద్ది సేపటిలో ఆ భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సిద్దం అవుతున్నాయి.
నిన్న జరిగిన దాడిలో కానిస్టేబుల్ హోదాగల డ్రైవర్ ఆర్.కే. రైనా, హెడ్ కానిస్టేబుల్ భోలాప్రసాద్ సింగ్ చనిపోగా, ఈరోజు ఉదయం భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పులలో స్పెషల్ ఫోర్సస్ కి చెందిన కెప్టెన్ పవన్ కుమార్ మృతి చెందారు. నిన్న గాయపడినవారిలో కానిస్టేబుల్స్: రాకేశ్ కుమార్, కన్నయ్య, సంజీవ్ కమానియా, ఠాకూర్, పరమ ఠాకూర్, రాజు ఠాకూర్, బరుణ ఠాకూర్, జె.నేగి, హెడ్ కానిస్టేబుల్ మునీమ్ ఉన్నారు.