హైదరాబాద్: యూకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధింపుకు నిరసనగా తీవ్రవాదులు చెలరేగే అవకాశముందన్న అనుమానాలు నిజమయ్యాయి. ఇవాళ తీవ్రవాదులు తెగబడ్డారు. పంజాబ్‌లోని గుర్దాస్పూర్లో ఈ తెల్లవారుఝామున ఒక ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన తీవ్రవాదులు, తర్వాత దీనానగర్ అనే ఏరియాలోని పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి కాల్పులకు దిగారు. ఇరువైపులనుంచి ఎదురుకాల్పులు జరిగాయి. తర్వాత సైన్యంకూడా అక్కడకు చేరుకుని తీవ్రవాదులపై దాడిచేసింది. దాదాపు పదిగంటలపాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సైనికులు ముగ్గురు తీవ్రవాదులను హతమార్చారు. తీవ్రవాదులు దాడిలో మొత్తం పదమూడుమంది చనిపోయారు. వీరిలో ఎనిమిదిమంది పోలీసులు, ముగ్గురు పౌరులు, ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఉన్నారు. చనిపోయిన పోలీసులలో జిల్లా ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. తీవ్రవాదులు పఠాన్‌కోట్-అమృత్సర్ రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలను అమర్చినట్లుకూడా కనుగొన్నారు. ఆ ఐదు బాంబులను నిర్వీర్యం చేశారు. గురుదాస్‌పూర్ ఇటు కాశ్మీర్‌కు, అటు పాకిస్తాన్‌కు సమీపంలో ఉండటంతో కాశ్మీర్నుంచిగానీ, పాకిస్తాన్ నుంచిగానీ తీవ్రవాదులు పంజాబ్‌లోకి ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు. వారి దాడి తీరు చూస్తుంటే ఖచ్చితంగా వారు కాశ్మీర్లో దాడులకు పాల్పడుతుండేవారేనని అనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. దాడి చేసిన తీవ్రవాదులు నలుగురని, సైనిక దుస్తులు ధరించిఉన్న వారు ఒక మారుతి కారును అపహరించి దానితో పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారని, వారిలో ఒక మహిళా టెర్రరిస్టుకూడా ఉందని తెలిసింది.
మరోవైపు పార్లమెంట్లో ఇవాళ సమావేశాలు ప్రారంభమవగానే పలువురు విపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రేపు పార్లమెంట్లో దీనిపై ప్రకటన చేయనున్నారు. నటుడు, బీజేపీ నాయకుడు వినోద్ ఖన్నా గుర్దాస్పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.