మతాన్ని ఉద్ధరించడానికే చేస్తున్నామంటారు. అల్లా రాజ్యాన్ని సృష్టిస్తామంటారు. ఆ మతస్తులందరికీ ఆ రాజ్యంలో రాజభోగాలు కల్పిస్తాం అని చెప్తూ ఉంటారు. సాధారణ పౌరులను టెర్రరిస్ట్‌లుగా మార్చే ప్రక్రియలో టెర్రరిస్ట్ గ్రూపులు చెప్పే మాటలు ఇలానే ఉంటాయి. సాధారణ పౌరులను ఉన్మాదులుగా మార్చడం కోసం ఇలాంటి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఆవేశపరులు ఆ టెర్రరిస్ట్ గ్రూపులకు బానిసలుగా మారిపోతున్నారు. అవసరమైతే సూసైడ్ బాంబర్స్‌గా కూడా మారిపోతున్నారు. సాధారణ పౌరుల ఆలోచనను, వివేచనను పూర్తిగా చంపేసి ఆవేశపరులయిన రాక్షసులుగా వాళ్ళను మార్చడం కోసం మతం అనే మత్తుమందును ఆయుధంగా వాడుకుంటున్నారు. కానీ కాస్త ఆలోచన ఉన్న ఎవరికైనా ఈ టెర్రరిస్టు గ్రూపులన్నీ కూడా ముస్లిములకు ఏ స్థాయిలో అన్యాయం చేస్తున్నాయో చాలా సులభంగానే అర్థమైపోతుంది.
పాకిస్తాన్లో ఒక విదేశీ క్రికెట్ టీం పర్యటించి ఎన్ని సంవత్సరాలవుతోంది? ప్రధాన దేశాల టీంలు ఏవీ కూడా పాకిస్తాన్లో పర్యటించకపోవడానికి కారణం టెర్రరిస్ట్‌ల భయం. ఆయా క్రికెట్ టీములన్నీ కూడా పాకిస్తాన్ వెళ్తే భద్రత ఉండదని చెప్పి అంతర్జాతీయ మీడియాతో చెప్పేస్తున్నారు. దానికి కారణం టెర్రరిస్ట్ దాడులే. శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి టెర్రరిస్ట్ గ్రూపులు శ్రీలంక క్రికెటర్లపైన దాడిచేశాయి. ఆ సంఘటనతో పాకిస్తాన్ క్రికెట్ తిరోగమన పయనం మొదలైంది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్స్ అందరూ కూడా పాకిస్తాన్లో టెర్రరిస్ట్‌ల దాడుల గురించి ఎన్నోసార్లు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడేశారు. ఆ సంఘటనతో పాకిస్తాన్‌కి వచ్చిన చెడ్డపేరు అంతా ఇంతాకాదు.
ఇప్పటికీ కూడా ఎవరైనా పాకిస్తాన్ పౌరుడు వేరే ఏ దేశంలో పర్యటించాలనుకున్నా ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానపు చూపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే చాలా అడుగులు ముందుకేసి ముస్లిములను అమెరికాలో అడుగుపెట్టకుండా చేయాలి అని పంతం పట్టి కూర్చుంటున్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా టెర్రరిస్టు గ్రూపులు ఏ మాత్రం తగ్గడం లేేదు. ముస్లిములకు మేలు చేయడానికే ఉన్నాం, అల్లా రాజ్యం స్థాపిస్తాం అని చెప్తూ టెర్రరిస్టులు చేస్తున్న పనులన్నీ కూడా ఆ ముస్లిములకు చెడు చేస్తున్నాయి. ముస్లిం మెజారిటీ దేశాలకు నష్టం చేకూరుస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ హింసాపూరిత లక్ష్యాలు నెరవేరే అవకాశమే లేదు. కానీ వాళ్ళ దుర్మార్గపు చర్యల వలన మాత్రం ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలు ముస్లిములకు నో ఎంట్రి బోర్డు పెట్టేలా పరిస్థితులు మారిపోతున్నాయి. టెర్రరిస్టుల రాక్షస చర్యల వలన సాధారణ ముస్లిములు ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కుంటారో చూడాలి మరి. టెర్రరిస్టులు ముస్లిం సమాజానికి చేస్తున్న ద్రోహాన్ని చాలా మంది ముస్లిం మేధావులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. టెర్రరిస్టుల హింసాకాండకు వ్యతిరేకంగా మొత్తం ముస్లిం సమాజమే పోరాడే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయని అనిపిస్తోంది. సాధారణ ముస్లిములకు టెర్రరిస్టులు చేస్తున్న ద్రోహం ఆ స్థాయిలో ఉంది మరి.