ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఉగ్రవాదులే అందరికంటే ముందున్నారని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల ఒక ఆర్మీ అధికారుల సమావేశంలో చెప్పారు. ఉగ్రవాదులు ఇంటర్నెట్ ద్వారా ఫేస్ బుక్, ట్వీటర్, వాట్స్ అప్ వంటి సామాజిక సైట్లను ఉపయోగించుకొంటూ తమ భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేస్తూ అన్ని దేశాలలో యువతని తమవైపు ఆకర్షిస్తూ ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలుగుతున్నారని ఆయన చెప్పారు. అయితే వారు ఆయన చెప్పిన దానికంటే ఇంకా చాలా ముందున్నారు.
గగనతలం ద్వారా చిన్నచిన్న వస్తువులను రవాణా చేయడానికి, శత్రువులను ఫోటోలు తీసి గుర్తించడానికి, ప్రకృతి విపత్తులలో చిక్కుకొన్నవారిని గుర్తించి సహాయం అందించేందుకు ఉపయోగపడే గాలిలో ఎగిరగలిగే ‘డ్రోన్’ పరికరాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చేసాయి. వాటి సహాయంతో డిల్లీలో రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి నివాసాలపై, లేదా సిబీఐ, సి.ఐ.ఎస్.ఎఫ్ బి.ఎస్.ఎఫ్. వంటి సంస్థల ప్రధాన కార్యాలయాలున్న సి.జి.ఓ.కాంప్లెక్స్ పై లేదా జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రదేశాలలో ఎక్కడయినా ఉగ్రవాదులు గగనతలం నుండి బాంబులు జారవిడిచి బారీ ప్రేలుళ్లకు పాల్పడవచ్చని నిఘావర్గాలు హెచ్చరికాలు జారీ చేసింది. దానితో అప్రమత్తమయిన హోం శాఖ డిల్లీ గగనతలంలో అనుమతిలేని ఎగిరే వస్తువులు కనబడినట్లయితే మరో ఆలోచన లేకుండా వెంటనే కూల్చివేయమని ఆయా ప్రాంతాలలో మొహరించి ఉన్న భద్రతాదళాలకు ఆదేశాలు జారీ చేసింది.
రిమోట్ కంట్రోల్ సహాయంతో ఆకాశంలో ఎగరగల డ్రోన్ వంటి పరికరాలను ఉపయోగించడంపై కేంద్రప్రభుత్వం ఇదివరకే నిషేధం విధించింది. కానీ ఆ నిషేధం ఉగ్రవాదుల ముందు పనిచేయదు కనుక ఇంకపెను ప్రమాదం పొంచి ఉన్నట్లే భావించి అందరూ అప్రమత్తంగా ఉండక తప్పదు. ఉగ్రవాదులకు విమానాలు సంపాదించడం కష్టమేమో కానీ ఆటవస్తువుల వంటి ఈ ఎగిరే డ్రోన్ పరికారాలను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక ఇప్పుడు సిసి కెమెరాలు నేలవైపే కాకుండా ఆకాశం వైపు కూడా బిగించుకోవాలేమో?