లిబియాలో ఐ.యస్. ఉగ్రవాదుల చెరలో చిక్కిన నలుగురు భారతీయులలో ఇద్దరినీ ఈరోజు సాయంత్రం ఉగ్రవాదులు విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. మిగిలిన ఇద్దరిని కూడా విడిపించేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలియజేసారు. విడుదలయిన ఇద్దరు భారతీయులను వారు పనిచేస్తున్న సిర్తే విశ్వవిద్యాలయానికి క్షేమంగా చేరుకోన్నట్లు తెలియజేసారు. విడుదలయిన ఇద్దరూ కూడా తాము క్షేమంగా ఉన్నట్లు తమ కుటుంబాలకు మెసేజులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి సుష్మా స్వరాజ్ వారు విడుదలయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ మెసేజ్ పెట్టారు. వారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మీకాంత్ మరియు విజయ్ కుమార్ విడుదలయినట్లు దృవీకరించారు. హైదరాబాద్ కి చెందిన గోపీకృష్ణ మరియు బలరాం ఇంకా విడుదల కావలసి ఉంది.
వారిలో ముగ్గురు లిబియాలో సిర్తే విశ్వవిద్యాలయంలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. మరొకరు వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్లు వికాస్ స్వరూప్ తెలియజేసారు. వారిని ఐ.యస్. ఉగ్రవాదులు ఈరోజు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ వారు 29వ తేదీ రాత్రి 11గంటలకు కిడ్నాప్ అయినట్లు ఆయన తెలియజేసారు. అప్పటి నుండి వారి విడుదలకు చాలా గట్టిగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు క్షేమంగా విడిపించుకోగలిగామని తెలియజేసారు. అయితే వారిని కిడ్నాప్ చేసింది ఐ.యస్. ఉగ్రవాదులు కారని, స్థానిక గ్యాంగ్ ఏదో కిడ్నాప్ చేసి ఉండవచ్చని అందుకే భారత ప్రభుత్వం లిబియా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకోగలిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఐ.యస్. ఉగ్రవాదుల చేతికి చిక్కినవారెవరూ ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు. కనుక ఆ వార్తలు నిజమని నమ్మవచ్చును. ఉగ్రవాదుల చేతిలో చిక్కి క్షేమంగా బయటపడిన ఇద్దరు భారతీయులు స్వదేశం చేరుకొన్నాక వారే తమను ఎవరు కిడ్నాప్ చేశారో ఎలాగూ చెపుతారు కనుక దాని గురించి కూడా ఊహాగానాలు అనవసరం. హైదరాబాద్ కి చెందిన ఇద్దరూ కూడా క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని కోరుకొందాము. కానీ దేశంలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కిడ్నాప్ నుండి భారత ప్రభుత్వం, ముఖ్యంగా పొట్ట చేత్తో పట్టుకొని అటువంటి ప్రమాదకరమయిన ప్రాంతాలలో ఉద్యోగాలకు వెళ్ళేవారు ఒక గుణపాఠంగా భావించడం మంచిది. బ్రతుకుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చు అని పెద్దలు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటే మంచిది.